ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్రయాదవ్
విజయవాడ : అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని
ప్రారంభించనున్నట్టు ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్రయాదవ్ ప్రకటించారు. జులై
23న కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ఆయన విజయవాడలో తెలిపారు. ఆదే రోజు
గుంటూరు-విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ప్రజా సింహగర్జన పేరిట
పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో దోపిడీ
పాలన నడుస్తోందన్న రామచంద్రయాదవ్ భూములు, మైనింగ్, ఇసుక పేరుతో వైసీపీ
నేతలు రూ.వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం
వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.30వేల కోట్ల దోపిడీ జరిగిందని
ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ విఫలమైందన్న
ఆయన రాజధాని కట్టలేకపోయారని, 3 రాజధానులని చెప్పి రాజధాని ఏదో చెప్పుకోలేని
పరిస్థితి సీఎం జగన్ కల్పించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగిస్తూ అణచి వేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం
దురదృష్టకరమన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే రాజకీయ
మార్పు కావాలన్నారు. రాబోయే కొత్త పార్టీ రాష్ట్రంలో నవశకాన్ని
తీసుకువస్తుందన్నారు.