ఏపీలో రూ.1,292.65 కోట్ల హైవే పనులకు ఆమోదం
ఆమోదం తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,292.65 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు
కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.
భారతమాల పరియోజనలో భాగంగా బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో
చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర ఆరులేన్ల యాక్సెస్
కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నిమిత్తం నిధులకు ఆమోదం
తెలిపినట్లు కేంద్రమంత్రి వరస ట్వీట్లలో పేర్కొన్నారు. బెంగళూరు–కడప–విజయవాడ
ఎకనామిక్ కారిడార్ బెంగళూరు ఎస్టీఆర్ఆర్ నుంచి ప్రారంభమవుతుందని,
ఇప్పటికే ఉన్న బెంగళూరు–విజయవాడ (ఎన్‌హెచ్–44)లోని కొడికొండ చెక్‌పోస్ట్
వరకు రహదారిని వినియోగించుకుంటుందని తెలిపారు. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్
ఎకనామిక్ కారిడార్ కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎన్‌హెచ్–16లోని అద్దంకి
వద్ద ముప్పవరం గ్రామం వరకు తదనంతరం విజయవాడ వరకు ఉన్న రహదారిని
వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు
342.5 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే అని తెలిపారు. ప్రకాశం
జిల్లాలోని ఈ ప్రతిపాదిత అభివృద్ధిని 14 ప్యాకేజీలుగా చేపడతామని కేంద్రమంత్రి
గడ్కరీ పేర్కొన్నారు.
భారత మాల పరియోజన కింద రూ. 2,493.07 కోట్లతో రెండు గ్రీన్ ఫీల్డ్ హైవేలను
నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందులో మొదటిది
వైయస్ఆర్ జిల్లా ఎర్రగుడిపాడు నుంచి ఆదిరెడ్డిపల్లె మధ్య 31 కిలోమీటర్ల మేర 6
వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే కాగా, రెండోది ప్రకాశం జిల్లా
చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర 6 వరుసల యాక్సెస్
కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇందులో తొలి ప్రాజెక్టుకు రూ. 1,200.42
కోట్లతో, రెండో ప్రాజెక్టుకు రూ. 1,292.65 కోట్లతో ఆమోదముద్ర వేసినట్లు ఆయన
శుక్రవారం ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ రెండు మార్గాలూ హైబ్రిడ్ యాన్యుటీ
మోడ్‌లో తలపెట్టిన బెంగుళూరు-విజయవాడ ఎకనమిక్ కారిడార్ (ఎన్‌హెచ్-544జీ)లోకి
వస్తాయని వెల్లడించారు. బెంగుళూరు-కడప-విజయవాడ ఎకనమిక్ కారిడార్ బెంగుళూరు
శాటిలైట్ టౌన్ రింగ్‌రోడ్డు దగ్గరి నుంచి ప్రారంభమై కొడికొండ చెక్‌పోస్ట్ వరకు
ఇప్పుడున్న బెంగుళూరు-హైదరాబాద్ (ఎన్‌హెచ్-44) మార్గంలోనే కొనసాగుతుందని
వివరించారు. ఆ తర్వాత కొడికొండ చెక్‌పోస్ట్ (కోడూరు గ్రామం) నుంచి అద్దంకి
సమీపంలో ఎన్‌హెచ్-16పై ఉన్న ముప్పవరం గ్రామం వరకు కొత్తగా గ్రీన్ ఫీల్డ్
ఎకనమిక్ కారిడార్ నిర్మాణమవుతుందని తెలిపారు. ముప్పవరం నుంచి విజయవాడ వరకు
ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్-16ని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. కొడికొండ నుంచి
ముప్పవరం వరకు 342.5 కిలోమీటర్లు పూర్తి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా
నిర్మించబోతున్నట్లు తెలిపారు. దీన్ని 14 ప్యాకేజీలుగా అభివృద్ధి
చేస్తామన్నారు.