జగనన్న ఆలోచనలు ఈ దేశానికే దిక్సూచి
ఏపీలో ఆనారోగ్యం శాపం కాదు
రోగికి ఉచితంగా చికిత్స అనేది ప్రభుత్వాల బాధ్యత
ఆ బాధ్యతను ఎలా నెరవేర్చవచ్చో జగనన్న చేసి చూపిస్తున్నారు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
న్యూ ఢిల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2022లో పాల్గొన్న మంత్రి
భారతదేశ వైద్య ఆరోగ్య రంగానికి ఏపీ దిక్సూచిగా నిలుస్తుందని వెల్లడి
అమరావతి : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం, వైద్య కళాశాలల నిర్మాణం,
నాడు- నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి, ఆరోగ్య ఆసరా, ఆసరా పింఛన్లు లాంటి
పథకాలు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త
విప్లవాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. భారత రాజధాని
న్యూఢిల్లీలో మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో
టైమ్స్ నవ్ సమ్మిట్- 2022 నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్
నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో
ఉన్నతస్థాయి కమిటీ హాజరైంది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య
కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్
నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఈ రెండు రోజుల శిఖరాగ్ర సమావేశానికి
ప్రపంచస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రతిపక్ష
నాయకులు, ప్రభావశీలులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులు, దేశవ్యాప్తంగా
ఆయా రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, మేధావులు, ఉన్నతస్థాయి అధికారులు
హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సామర్థ్యంపై చర్చలు
జరిగాయి. 25కుపై సెషన్లు నిర్వహించారు. దేశ వృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు,
రాజకీయ, భౌగోళిక అంశాలు, దేశ సైనిక వ్యూహం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక
సదుపాయాల వృద్ధి, దేశ విద్యుత్ రంగం, డీకార్పనైజింగ్ విధానాలు, మన దేశ
శక్తి ఇలా ఎన్నో అంశాలపై విపులంగా చర్చలు జరిగాయి. దేశంలోని మనుషులందరి
ఆరోగ్యాన్ని డిజిటలైజ్ చేయడం, అందుకు అనుగుణంగా వారికి వైద్య సేవలు
అందించడం అనే విషయంపై ఏపీ ప్రభుత్వం నుంచి సమ్మిట్‌లో చర్చకు
ఆహ్వానించారు. ఈ విషయంలో దేశంలోనే ఏపీ ఆదర్శంగా ఉందని నిర్వాహకులు
తెలిపారు. ఈ చర్చ సందర్భంగా మంత్రి విడదల రజిని ఏపీలో వైద్య విధానం ఎలా
ఉందనే విషయాలను వివరించారు.
వైద్యం భారం కాకూడదు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అనారోగ్యం కూడా ఒకటని మంత్రి
విడదల రజిని తెలిపారు. అనారోగ్యం పేదరికానికి కూడా దారి తీస్తోందని
చెప్పారు. ఈ సమస్యను గుర్తించి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య రంగ స్వరూపాన్ని పూర్తి గా మార్చేస్తున్నారని
తెలిపారు. ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలను ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారని
వివరించారు. వైద్య ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను
జగనన్న తీసుకొచ్చారని చెప్పారు. 2200కుపై ఆస్పత్రులను వైఎస్సార్
ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకొచ్చి 3255 చికిత్సలను ఉచితంగా ఆ
ఆస్పత్రులు పేదలకు అందించేలా జగనన్న చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఏటా 3వేల కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చవుతున్నా సరే… జగనన్న ఆ
మొత్తాన్ని భరిస్తున్నారని వెల్లడించారు. ఏపీలో 2.62 లక్షల మంది
వాలంటీర్లు పనిచేస్తున్నారని, వీరంతా ఒక్కొకరు 50 ఇళ్లకు చొప్పున
జవాబుదారీగా ఉంటారని చెప్పారు. వీరితోపాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కూడా
ప్రజా ఆరోగ్య సేవల్లో ఉంటారని వెల్లడించారు. వీరందరి సహకారంతో
రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలిగామని చెప్పారు.
తమ ముఖ్యమంత్రి ఒక్క ఆరోగ్యశ్రీ పథకంతోనే వదిలేయలేదని, ఈ పథకం
ద్వారా చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యుడి సిఫారుసు మేరకు డిశ్చార్జి
చేశాక కూడా రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5వేలు ఆర్థిక సాయం
అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆసరా అనే ఈ పథకం ద్వారా ఇప్పటికే
రూ.785 కోట్లు రోగులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమచేశామని
వివరించారు.
అబ్దుల్ కలాం ఆకాంక్షలు నిజం చేశాం
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్యం
అందాలని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాంక్షించారని,
ఆంధ్రప్రదేశ్‌లో ఇది నెరవేరిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 10032
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, 1100కు పైగా ప్రాథమిక
ఆరోగ్యకేంద్రాల నిర్మాణం, ఆధునికీకరణ ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలను
బలోపేతం చేశామని వివరించారు. తమ ముఖ్యమంత్రి వర్యులు చికిత్స రోగానికి
మాత్రమే కాదని, రోగికి కూడా చేయాలని చెబుతుంటారని గుర్తుచేశారు. అందుకే
రోగికి ఇంటివద్దనే వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ మధ్యనే మా
ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాన్ని తెరపైకి
తీసుకొచ్చారని తెలిపారు. ఈ దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్యశాఖలో ఇది
సరికొత్త పరిణామం అని చెప్పారు. రోగి ఇంటి గుమ్మ వద్దకే డాక్టర్ వచ్చి
వైద్యం అందించడం ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానంలోని ప్రత్యేకత అని
తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించుకుంటున్నామని,
దీని ద్వారా మా రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా ఇచ్చే
వీలు కలుగుతోందని చెప్పారు.
మెడికల్ కళాశాలల నిర్మాణంతో ఎంతో మేలు
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులోని
విలువైన, అత్యాధునిక వైద్య వసతులను తాము కోల్పోయామని చెప్పారు. ఈ లోటును
భర్తీ చేయడానికి రాష్ట్రంలో 8500 కోట్ల రూపాయలతో కొత్తగా 17 వైద్య
కళాశాలలను తాము నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సేవలు
అందిస్తున్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రులను
బలోపేతం చేసేందుకు జగనన్న రూ.3820 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, రాష్ట్రంలోని పలు
ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, క్యాన్సర్ ఆస్పత్రులను
నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 3.52 కోట్ల మందికి హెల్త్ ఐడీలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3.5 కోట్ల మందికి ఆరోగ్య ఐడీలను తాము
సృష్టించామని మంత్రి విడదల రజిన తెలిపారు. 1.5 కోట్ల ఎలరక్ట్రానిక్
హెల్త్ రికార్డులను తయారుచేసుకోవడం ద్వారా ఈ దేశంలోనే డిజిటిలైజేషన్
విషయంలో ఏపీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే
తమ రాష్ట్రానికి 2 అంతర్జాతీయ, ఆరు జాతీయ అవార్డులు కూడా వచ్చాయని
గుర్తుచేశారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని
ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా చూస్తున్నారని, అందుకే ఎంతో సేవ ఆయన
ప్రజలకు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో క్లీన్‌స్వీప్
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు
తెలుసుకన్నారని, ముఖ్యమంత్రి కాగానే వారి సమస్యలను ఒక్కొకటి తీరుస్తూ
వస్తున్నారని వివరించారు. నవరత్నాలు… ద్వారా ప్రజలకు ఎంతో మేలు
చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన అని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే భయంలో ఉన్నారని
చెప్పారు. అందుకే తన ప్రసంగాల్లో ప్రజలను ఓట్లు వేయాలంటూ దిగజారి
మాట్లాడుతున్నారని తెలిపారు. బాబు తప్పుడు వాగ్దానాలతో ప్రజలు ఇప్పటికే
విసిగిపోయి ఉన్నారని, ఆయన మాయ మాటలను ప్రజలు ఇక వినరని స్పష్టం
చేశారు. 2024 ఎన్నికల్లో 175 కు 175 స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్
సాధిస్తామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి 40 ఏళ్ల అనుభవం అవసరం
లేదని, ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశం, మంచి సంకల్పం చాలని
వివరించారు.