కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో 32754 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఏపీలో 2018-19లో 6933 టన్నులు, 2019-20లో 6539 టన్నులు, 2020-21లో 5898 టన్నులు, 2021-22లో 7096 టన్నులు, 2022-23లో 6288 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 5,71,093 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగినట్లు మంత్రి తెలిపారు.
ముడి ఇనుము ఉత్పత్తిలో 2014లో నాల్గవ స్థానంలో ఉన్న ఇండియా 2018లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. ఇండియా 2018లో 109.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండవ స్థానానికి చేరుకోగా, జపాన్ 104.3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి 3వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఇండియా ఐదేళ్లలో ఇనుము ఉత్తత్తిలో 55.7శాతం వృద్ధి సాధించిందని, 2013-14 లో 81.69 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా 2022-23 లో 127.20 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేసిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా స్టీల్ ఉత్పత్తిలో ఇండియా 5శాతం సీఐజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించిందని మంత్రి వెల్లడించారు. స్టీల్ క్రమబద్దీకరించిన రంగం కావడంతో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుందని, జాతీయ స్టీల్ పాలసీ 2017 కింద ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి పలు చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.