విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోర్టులు, రహదారులే మూలస్తంభాలని
రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఓడరేవులు,
వాటికి అనుసంధానమైన రహదారులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలో గుజరాత్
తర్వాత అతి పొడవైన సముద్ర తీరం (975 కి.మీ) ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని
నౌకాశ్రయాలు రాష్ట్ర ఆదాయం పెంచడానికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని
చెప్పారు. ముంబై, చెన్నైతో పోటీగా విశాఖపట్నం అభివృద్ధి సాధించడానికి కారణం ఈ
రెండు మహానగరాల్లో మాదిరిగానే విశాఖలో సకల సౌకర్యాలున్న పోర్టు ఉండడమేన్నారు.
రేవు పట్టణాలు ఎప్పుడూ అవి ఉన్న రాష్ట్రాలు అన్ని రంగాల్లో ప్రగతి
సాధించడానికి దోహదం చేస్తాయని పేర్కోన్నారు. నాలుగేళ్ల నుంచీ రాష్ట్ర
ప్రభుత్వం నౌకాశ్రయాల అభివృద్ధి, కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల
నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ఏపీ తూర్పు తీరంలో వరుసగా
ఏర్పాటయ్యే అనేక పోర్టుల ద్వారా దాదాపు పది కోట్ల టన్నుల సరుకుల ఎగుమతులు,
దిగుమతుల జరిగేలా చూడడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ఏడాది క్రితమే వెల్లడించిందని
చెప్పారు. నౌకాశ్రయాలకు తోడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల మత్స్య సంపద
అందుబాటులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తే శరవేగంతో అభివృద్ధి
ఏపీలో తగిన సంఖ్యలో రైలు మార్గాలు, రహదారులు అన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ
ఉన్నాయని అన్నారు. విమానాశ్రాయాలు, నౌకాశ్రయాలను మిగిలిన నగరాలు, పట్టణాలను
కలిపే రోడ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోర్టులను జాతీయ
రహదారులతో అనుసంధానం చేయడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ
కార్యక్రమానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని కేంద్ర రోడ్డు రవాణా,
జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారని అన్నారు. ఇలా రాష్ట్రంలోని
ఐదు పోర్టులను అనుసంధానిస్తూ 12,350 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగితే
అనూహ్య రీతిలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతుందని వెల్లడించారు. దేశంలో
పోర్టులను అనుసంధానిస్తూ నిర్మించనున్న రోడ్డు ప్రాజెక్టుల్లో–విశాఖపట్నం,
గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవులను ఎంపికచేశామని మంత్రి
చెప్పడం రాష్ట్రానికి శుభవార్త అని అన్నారు.మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన
ప్రమాణాలు మెరుగు పరిచే ఇతర సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం వల్ల
దక్షిణాదిలో ఏపీ అగ్రస్థానానికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుందని
చెప్పారు. దేశంలో గుజరాత్ మొదలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అన్ని
తీరప్రాంత రాష్ట్రాలూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, వాటి అభివృద్ది,
వాటితో జాతీయ రహదారుల అనుసంధానం జరగడం వల్లే ఎనలేని ప్రగతి సాధించాయనడంలో
ఎలాంటి అతిశయోక్తి లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.