రేపు పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మ
సీఎం స్పెషల్ సీఎస్ గా పూనంకు అవకాశం
పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్
వెలగపూడి : ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్
అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్
ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి ప్రస్తుతం ఏపీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంట్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన
తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి ఆ తర్వాత
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక
శాఖల్లోనూ ఆయన పని చేశారు. రేపు (నవంబర్ 30) ప్రస్తు సీఎస్ సమీర్ శర్మ పదవీ
విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీకి తదుపరి సీఎస్ గా ఎవరు నియమితులవుతారన్న
విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సీఎస్ గా జవహర్ రెడ్డికే అవకాశం
దక్కుతుందన్న వాదనలు గట్టిగానే వినిపించాయి. తాజాగా ప్రభుత్వం కూడా జవహర్
రెడ్డి వైపే మొగ్గు చూపుతూ సీఎస్ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సమీర్ శర్మ పదవీ విరమణ చేయగానే… జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు
స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించిన రోజే
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎస్ అశకాశం
దక్కుతుందని భావించిన పూనం మాలకొండయ్యకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో
స్పెషల్ గా సీఎస్ గా నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శిగా మధుసూదన రెడ్డి, ఆ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే నియమితులయ్యారు.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు, భవనాల శాఖ
ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య
కార్యదర్శిగా కొనసాగుతున్న బుడితి రాజశేఖర్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని
ఆదేశాలు జారీ అయ్యాయి.