రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో మెరుగైన విద్యుత్ వ్యవస్థ
క్లిష్ట పరిస్థితుల్లోనూ వినియోగదారులకు నిరంతర సరఫరా
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్న డిస్కంలు
2018లో తలసరి విద్యుత్ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే
రాష్ట్రంలో పెరిగిన తలసరి విద్యుత్
2022లో ఒక్కొక్కరికి అందుబాటులో 1,378.6 యూనిట్లు
గుంటూరు : ఏ రాష్ట్రంలో అయినా పౌరులకు సరిపడినంత స్థాయిలో విద్యుత్
అందుబాటులో ఉందంటే ఆ రాష్ట్రంలో ఉత్పాదకత, జీవన ప్రమాణాలు మెరుగైన స్థితిలో
ఉన్నాయని అర్థం. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ వినియోగాన్ని సైతం ప్రామాణికంగా
తీసుకుంటారు. అలాంటి అత్యుత్తమ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరోసారి
రుజువైంది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ లభ్యత పెరుగుదలే దీనికి నిదర్శనంగా
నిలుస్తోంది. 2018లో తలసరి విద్యుత్ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే ఉండగా
ఇప్పుడది 1,378.6 యూనిట్లకు పెరిగింది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం
విద్యుత్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహం, బలపడుతున్న విద్యుత్ వ్యవస్థల
కారణంగానే ఇది సాధ్యమైంది. వినియోగదారులకు అత్యధిక విద్యుత్‌ను అందుబాటులో
ఉంచేందుకు ఏపీ ట్రాన్స్‌కో మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది.
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అంతర్గత డిమాండ్ అంచనా
నమూనాను అభివృద్ధి చేసింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీ
ఎస్ఎల్డీసీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను
ఉపయోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్‌ను
అభివృద్ధి చేసింది.
మున్ముందు మరింత మెరుగ్గా : రాష్ట్రంలోని 1.92 కోట్ల వినియోగదారులకు విద్యుత్
సరఫరా చేస్తున్న మూడు డిస్కంలు ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్
డిస్కమ్స్’ నివేదికలో ఇప్పటికే ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. రానున్న రోజుల్లో
సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ‘లాస్ డిడక్షన్ వర్క్స్’ పేరుతో
ఏపీ ఈపీడీసీఎల్‌లో రూ.2,617.54 కోట్లు, ఏపీ సీపీడీసీఎల్‌లో రూ.1,498.5
కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్లో రూ.5,160.64 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నాయి.
విద్యుత్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానివల్ల ప్రజలు,
విద్యుత్ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కూడా విద్యుత్ సంస్థలు
చర్యలు చేపడుతున్నాయి. భద్రతా చర్యలలో భాగంగా స్ప్రింగ్ చార్జ్ బ్రేకర్స్
స్థానంలో సాంకేతికంగా మెరుగైన ‘ఫాస్ట్ యాక్టింగ్ పర్మినెంట్ మాగ్నెట్
యాక్యుయేటర్’ మెకానిజం టైప్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లతో భర్తీ
చేయాలని డిస్కంలు ఇప్పటికే ప్రతిపాదించాయి.
ప్రభుత్వ ప్రోత్సాహం : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు
గడచిన మూడేళ్లలో డిస్కంలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం
అందించింది. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం.
మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అధిక
విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతున్నాం.