న్యూఢిల్లీ : సీఎం మూడు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీ సీఎం జగన్
ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు.
తాజాగా ఆయన హోం మంత్రి అమిత్ షా తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా విభజన చట్టం హామీల అమలుకోసం మరోసారి జగన్ పట్టుబట్టారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చ
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో జగన్ భేటీ అయ్యారు. 40నిమిషాల
సేపు ఈ సుదీర్ఘ భేటీ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన
అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని
కోరారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను
వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్ సహా
షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజనపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి
రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ
విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, వెంటనే ఈ
బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రోజు కేంద్ర
జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం
నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు
సమావేశం కొనసాగగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు.