గుంటూరు : ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో మరో మైలు రాయి వచ్చి చేరిందని రాష్ట్ర
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మంగళవారం తెలిపారు. ప్రభుత్వ
మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పేర్కొన్నారు. అందులోభాగంగానే తొలుత
విజయనగరంలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు
జాతీయ వైద్య మండలి (ఎన్ ఎంసీ ) అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ
నెల మూడో తేదీన ఎన్ ఎం సీ విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో
తనిఖీలు నిర్వహించిందని చెప్పారు. ఆ సమయంలో అక్కడి నిర్మాణాలు, బోధనా,
బోధనేతర సిబ్బంది, వసతులు, ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టళ్లు,
ఆస్పత్రి, బోధనా సిబ్బంది అనుభవం, వారి పబ్లికేషన్లు, అందుబాటులో ఉన్న
నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఇలా అన్ని అంశాలను ఎన్ ఎంసీ క్షుణ్ణంగా
పరిశీలిచిందని వివరించారు. ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది
నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెందిన ఎన్ ఎంసీ ఈ ఏడాది నుంచే
తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. ఆ
మేరకు మంగళవారం ఉత్తర్వులు ప్రభుత్వానికి అందాయని చెప్పారు. మొత్తం 150
సీట్లు మంజూరు చేస్తూ ఎన్ ఎంసీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో
మొత్తం రూ.8500 కోట్లతో మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని
జగనన్న చేపట్టారని తెలిపారు. వీటిలో తొలిసారిగా ఉత్తరాంధ్రకు చెందిన
విజయనగరం కళాశాలకు అనుమతులు రావడం మనందరికీ గర్వకారణమని
పేర్కొన్నారు.
మరో నాలుగు కళాశాలలకు కూడా
ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్
కళాశాలలను కూడా ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు
వెళుతోందని పేర్కొన్నారు. మచిలీపట్టణం, ఏలూరు, విజయనగరం, నంద్యాల,
రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు
సమకూర్చుతున్నామన్నారు. అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని
తెలిపారు. ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరయ్యేలా సిబ్బంది నియామకాలు
ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల
నిర్మాణం, కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, వైద్య పరికరాల కొనుగోలు ఇలా
అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీజీ సీట్లను రాష్ట్రంలో గణనీయంగా
పెంచుకునే విషయంలోనూ జగనన్న ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి
తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ
సీట్ల సంఖ్య ఏకంగా 1249 కు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది
సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు
ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా
సాధించగలిగామని వివరించారు.