శ్రీకాకుళం : న్యాయపరమైన చిక్కులు తొలగించుకుని ఏప్రిల్ తర్వాత విశాఖే
రాజధాని అవుతుందని ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి
వెల్లడించారు. శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన
మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా
పరిగణించి పార్టీ ప్రజాప్రతినిధులు కచ్చితంగా ఓట్లు వేయాలని చెప్పారు.
మహిళా ప్రజాప్రతినిధుల గైర్హాజరుపై బొత్స అసహనం : ఈ సమావేశానికి జిల్లాలోని
మహిళా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో గైర్హాజరవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ
అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
ఎలా ఓటు వేయాలో తెలియజేయాలనే ఉద్దేశంతో సమావేశం పెడితే మహిళలు రాకుండా, వారి
భర్తలు హాజరుకావడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీ కి 646
ఓట్లున్నాయని, దాని కంటే ఒకటో, రెండో ఓట్లు అధికంగా పడేలా చూడాలని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వెంటనే వారిని
సస్పెండ్ చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. మనకు ప్రతి
ఇంట్లో వేగులు ఉన్నారని, ఏం జరిగినా సమాచారం తెలిసిపోతుందన్నారు. విశాఖకు
రాజధాని వస్తే మనందరి ఆర్థిక స్థితి మారుతుందన్నారు. అందుకు వ్యతిరేకంగా
గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారా అని ధర్మాన ప్రశ్నించారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థి ముసుగులో
టీడీపీ అభ్యర్థిని నిలిపారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ ఎన్నికలు
వచ్చినా మనకు ప్రత్యర్థి ఎప్పుడూ టీడీపీనే అని అందరూ గ్రహించాలని చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే సంక్షేమం తప్ప అభివృద్ధిపై
దృష్టి సారించడం లేదని అడుగుతున్నారని వాపోయారు. విద్య, వైద్య రంగాల్లో అనేక
అభివృద్ధి పనులు చేశామని, 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
ఇలాంటివన్నీ వివరించాలని అప్పలరాజు సూచించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు
చెందిన వైవైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.