నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో సుదీర్ఘ
యాత్రకు సన్నద్ధమయ్యారు. అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ప్రజల్లో మరింత
బలపడటమే లక్ష్యంగా ఏప్రిల్ నుంచి ప్రజా ఆశీస్సుల యాత్రను ఆయన
ప్రారంభించనున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్య
నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. యాత్రకు సంబంధించి పలు అంశాలను ఆయన
ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుదీర్ఘంగా 141 రోజులు పాటు ఈ
యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని అర్బన్
ప్రాంతాల తో పాటు గ్రామీణాల ప్రాంతాల్లో కూడా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ 141
రోజులు ప్రజల నివాసంలోనే భోజనం చేసి అక్కడే రూరల్ ఎమ్మెల్యే బస చేయనున్నారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ వేగవంతంగా రెడీ అవుతోంది.
నెల్లూరు రూరల్ కు సంబంధించి వివిధ ప్రజా సమస్యలపై ఈనెల 25న ఆందోళన
కార్యక్రమం, అనంతరం మార్చిలో శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర కార్యక్రమం
ముగిసిన వెంటనే ఈ సుదీర్ఘ యాత్రకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 25వ డివిజన్ నుంచి ఈ
యాత్రను ప్రారంభించనున్నారు ప్రతి ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడంతో
పాటు వారి ఆశీస్సులను అందుకోవటమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. దీర్ఘకాలిక
ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత బలపడటమే
లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయి.