ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం
జరుగనుంది. కల్యాణవేదిక వద్ద రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణం
నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు
వీలుగా ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కల్యాణోత్సవం
సందర్భంగా బుధవారం సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య
కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి శ్రీరామ నామామృతం
భజన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల
వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల
పర్యవేక్షణలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా
కాంతకోరిక నిర్వహిస్తారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను
శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరిక అంటారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం
చేపడతారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు
మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు. రాత్రి 8 గంటలకు శ్రీ
సీతారాముల కల్యాణం ప్రారంభమవుతుంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ,
లోకకల్యాణం కోసం సంకల్పం చేయిస్తారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం
చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ,
వరప్రేశనం (కన్యావరణం), మధుపర్కార్చనం చేస్తారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం
చేసి సీతారామ చంద్రుల ప్రవరలను చదువుతారు. వంశ స్వరూపాన్ని స్తుతిస్తారు.
అగ్నిప్రతిష్టాపన తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠిస్తారు. ఆ తరువాత
మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేస్తారు. స్వామి నివేదన,
వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తవుతుంది. కల్యాణం అనంతరం రాత్రి
11 గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు.