ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
ఏప్రిల్ 5న జరగనున్న సీతారాముల కల్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం
చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తెలిపారు. కల్యాణం రోజున భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం వైఎస్సార్
జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కలిసి ఈవో పరిశీలించారు. విభాగాల వారీగా
జరుగుతున్న ఏర్పాట్లపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఈవో
మీడియాతో మాట్లాడుతూ కల్యాణం రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర
ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు
తెలిపారు. కల్యాణవేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో
కూడిన తలంబ్రాలు, పసుపుకుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని, భక్తులు
ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కల్యాణాన్ని
దర్శించాలని కోరారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు
అందుబాటులో ఉంచుతామన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ
పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక
వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఈవో క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈవో వెంట టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, అదనపు
ఎస్పీ కృష్ణారావు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్
కుమార్, టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఇ
ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, విజివో మనోహర్, రవాణ విభాగం జిఎం శేషారెడ్డి,
డిఎఫ్ఓ శ్రీనివాస్, డెప్యూటీ ఈవోలు నటేష్ బాబు, సుబ్రహ్మణ్యం, గోవిందరాజన్,
లోకనాధం, గుణభూషణ్ రెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, అదనపు
ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.