విద్యాధరపురం లోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ
హాజరైన సంస్థ ఎం.డి సి.హెచ్.ద్వారకా తిరుమల రావు
క్రమశిక్షణ, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచన
విజయవాడ : ఆర్టీసీ సర్వీసులో (01.01.2016 నుండి 31.12.2019 వరకు) చనిపోయిన
ఉద్యోగుల కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగావకాశం
కల్పించడంలో, రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యం కనబరిచి 294 మందికి (34 మంది జూనియర్
అసిస్టెంట్లు, 99 మంది ఆర్టీసీ కానిస్టేబుల్స్, 1 డ్రైవర్, 61 మంది
కండక్టర్లు, 99 మంది అసిస్టెంట్ మెకానిక్ లకు) ఉద్యోగావకాశం కల్పించిందని
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి,హెచ్. ద్వారకా తిరుమల రావు తెలిపారు. బుధవారం
విజయవాడ విద్యాధరపురం నందలి ఏపీఎస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అకాడమీ లో కారుణ్య
నియామకం క్రింద నూతనంగా ఎంపికైన 34 మంది జూనియర్ అసిస్టెంట్ లకు ఇండక్షన్
ట్రైనింగ్ శిక్షణా క్లాసులు ప్రారంభించిన అనంతరం, హాజరైన జూనియర్ అసిస్టెంట్
అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
తొలుత జూనియర్ అసిస్టెంట్ లుగా ఎంపికైన 34 మంది అభ్యర్థులకు (20మంది
స్త్రీలు, 14మంది పురుషులు) సంస్థలోకి స్వాగతం పలుకుతూ శుభాభినందనలు తెలిపారు.
అందరు అభ్యర్థులలో టాప్ క్రీమ్ అభ్యర్థులతో 34 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
భర్తీ చేయడం జరిగిందని తెలుపుతూ వీరు వివిధ రకాల బాక్ గ్రౌండ్ ల నుండి
వచ్చారని, వివిధ విద్యార్హతలు కలిగి ఉన్నారని తెలిపారు. సంస్థలో ఈ
ఉద్యోగావకాశంతో మరిన్ని మెట్లు అధిరోహించి చక్కని ప్రమోషన్లు పొందే అవకాశం
మెండుగా ఉందని, తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సంస్థ
అభివృధ్ధి కి చిత్తశుద్ధితో పనిచేయాలని ఎం.డి ఆకాంక్షించారు. శిక్షణా తరగతులలో
అన్ని విషయాలు ఆకళింపు చేసుకుని శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. శిక్షణా
కాలంలో స్టైఫండ్ చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు 3 నెలలపాటు
జరుగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ఎం.డి వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.
బ్రహ్మానంద రెడ్డి విచ్చేసి పరిచయ ప్రసంగం చేశారు. ట్రాన్స్పోర్ట్ అకాడమీ
ప్రిన్సిపాల్ కుమారి డి.సాంబ్రాజ్యం, ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్
శ్రీలక్ష్మి ఇంకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.