సైన్యంలో ఉండాలంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోవచ్చు
వాగ్నర్ బలగాలకు పుతిన్ స్పష్టీకరణ
మాస్కో : వాగ్నర్ గ్రూపు సాయుధ తిరుగుబాటుకు పాల్పడినప్పుడు యావద్దేశం
ఐక్యతతో వ్యవహరించి రక్తపాతాన్ని నివారించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్ కొనియాడారు. తిరుగుబాటు ముగిశాక తొలిసారి టీవీ ఛానల్ ద్వారా
జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన క్రెమ్లిన్‌లో సైనికాధికారులతో కూడా
మాట్లాడారు. కిరాయి సైన్యం అధినేత ప్రిగోజిన్ పేరెత్తకుండా ఆ తిరుగుబాటుకు
నేతృత్వం వహించిన వారిని విమర్శించారు. ఉక్రెయిన్ చేతిలో కీలుబొమ్మల్లా వారు
వ్యవహరించారని తప్పుబట్టారు. రక్తపాతానికి దారితీయకుండా వాగ్నర్ పోరాటవీరులు
సంయమనం పాటించారంటూ వారిని మాత్రం కొనియాడారు. తిరుగుబాటుకు రష్యా సైనికులు,
ప్రజలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని పుతిన్ చెప్పారు. అంతర్గత ఘర్షణలతో రష్యాలో
రక్తం చిందాలని పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్ కోరుకున్నాయని ఆరోపించారు.
రక్తపాతం నివారించేందుకు వాగ్నర్ సభ్యులకు క్షమాభిక్ష ప్రసాదించానని
వివరించారు. వ్యవస్థీకృత సంక్షోభానికి చేసే అన్ని ప్రయత్నాలు, బెదిరింపులు
చివరకు విఫలమవుతాయని ప్రజల సంఘీభావం తెలియజేస్తోంది. ఇక మీరు (వాగ్నర్
సభ్యులు) రక్షణశాఖ ఒప్పందం ద్వారా రష్యా సైన్యం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో
చేరవచ్చు. లేదా, మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల వద్దకు వెళ్లిపోవచ్చు. కావాలంటే
బెలారస్ కూడా వెళ్లవచ్చని పుతిన్ చెప్పారు. రక్షణ మంత్రి షొయిగు సహా
ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. వాగ్నర్ తిరుగుబాటు నేపథ్యంలో ఉక్రెయిన్
యుద్ధానికి ముగింపు చూపించే ప్రయత్నంలో పోప్ ఫ్రాన్సిస్ తరఫున శాంతిదూతల
బృందం బుధవారం మాస్కో చేరుకోనుంది.
ముగిసిన విచారణ : వాగ్నర్ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్‌పై, ఇతర అనుచరులపై
నేరాభియోగాలను ఎత్తివేసి, విచారణను ముగించినట్లు రష్యా ప్రకటించింది.
తిరుగుబాటులో పాల్గొన్నవారు నేరానికి పాల్పడాలన్న కార్యకలాపాలను
విరమించుకున్నట్లు విచారణలో తేలినందువల్ల కేసులను ఇంతటితో ముగిస్తున్నట్లు
రష్యా ‘ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్’ ప్రకటించింది.
బెలారస్ చేరుకున్న ప్రిగోజిన్ : ప్రిగోజిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో
దిగారు. ఈ విషయాన్ని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో
ధ్రువీకరించారు. వారి సొంత ఖర్చులపై ప్రిగోజిన్, ఆయన అనుచరులు కొంతకాలం
తమదేశంలో ఉండవచ్చని చెప్పారు.