హాజరు కానున్న కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ, తదితర
పార్టీల అధినేతలు
భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరిగే అవకాశం
కీలక లక్ష్యాలు నాలుగు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత
దిశగా కీలక అడుగు ఎల్లుండే పడనుంది. శుక్రవారం (జూన్ 23)న బిహార్ రాజధాని
పట్నాలో జరిగే విపక్షాల సమావేశానికి నీతీశ్ సర్కారు అన్ని ఏర్పాట్లూ చేసింది.
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు
దేశంలోని 15 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీలో పాల్గొననున్నాయి. బిహార్ సీఎం
నీతీశ్‌కుమార్ అధికారిక నివాసంలోని ‘నెక్ సంవాద్ కక్షా’లో ఈ సమావేశం
జరగనుంది. గురువారం (జూన్ 22) సాయంత్రానికే విపక్ష నేతలంతా పట్నాకు
చేరుకోనున్నారు. వారి బస ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. సమావేశం
శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. జేడీయూ అధినేత
నీతీశ్‌కుమార్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్
కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ యువరాజు
రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ
చీఫ్ అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా,
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, తదితర హేమాహేమీలు ఈ సమావేశానికి
హాజరుకానున్నారు. అజెండా ప్రకారం తొలుత ఈ సమావేశంలో నీతీశ్ కుమార్ కీలక
ప్రసంగం చేస్తారు. మోదీ సర్కారు హయాంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైన,
విపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతపైన ఆయన ప్రధానంగా మాట్లాడనున్నారు.
నీతీశ్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కేజ్రీవాల్ మాట్లాడుతారు.
ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన సమయం కావడంతో ఈ ఏడాది మధ్యప్రదేశ్,
రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే కీలక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్
నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఢిల్లీలో అధికారయంత్రాంగంపై పెత్తనాన్ని
కేంద్రానికి కట్టబెట్టే ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటో ఈ
సమావేశానికి ముందే తేల్చిచెప్పాలని, కాంగ్రెస్‌తో చెప్పించే బాధ్యత మిగతా
పార్టీలు తీసుకోవాలని ఆప్ పట్టుపడుతోంది. దీనిపై ఖర్గే, రాహుల్‌తో
చర్చించేందుకు కేజ్రీవాల్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నా వారు ఆయనకు సమయం
ఇవ్వని సంగతి తెలిసిందే.
నాలుగు లక్ష్యాలు : ఈ సమావేశంతోపాటు భవిష్యత్తులో నిర్వహించబోయే మరిన్ని
సమావేశాల ద్వారా ప్రధానంగా నాలుగు లక్ష్యాలు సాధించాలని విపక్ష నేతలు
భావిస్తున్నట్టు సమాచారం.
విపక్షాల ఐక్యత : మోడీ సర్కారును ఎదుర్కొనే విషయంలో తామంతా ఐక్యంగా ఉన్నామనే
విషయాన్ని ఈ భేటీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఆ
దిశగా ఇది తొలి సమావేశం అని, ముందు ముందు తామంతా మరిన్నిసార్లు భేటీ అవుతామని
ఆర్జేడీ అధికార ప్రతినిధి కిశోర్ తెలిపారు.
ప్రాంతీయ శత్రుత్వాలను పక్కనపెట్టడం : రాష్ట్రాల స్థాయిలో ఉన్న పోటీలను
పక్కనపెట్టి జాతీయస్థాయిలో మోదీ సర్కారును బలంగా ఢీకొట్టడం ఎలా అనే అంశంపై
చర్చించడం కూడా ఈ భేటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో
పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ హోరాహోరీ పోరాడుతున్నాయి. అవే
పార్టీల అధినేతలు.. శుక్రవారం జరిగే విపక్షాల సమావేశంలో పాల్గొనడం ద్వారా
రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా జాతీయస్థాయిలో కలిసి పనిచేస్తామన్న
సందేశాన్ని ప్రజలకు ఇవ్వనున్నట్టు సమాచారం.
సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమబెంగాల్లో వామపక్షాలతో
సర్దుబాట్లున్నాయిగానీ కేరళలో ఢీ అంటే ఢీ. టీఎంసీకి పశ్చిమబెంగాల్లో
కాంగ్రెస్ పొడ గిట్టదుగానీ అసోం, త్రిపుర, మేఘాలయలో హస్తంతో చేతులు కలపడానికి
సిద్ధమే. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఈ పార్టీలన్నింటి నడుమా ఇలా ఏదో ఒక సమస్య
ఉంది. వీటన్నింటినీ అధిగమించి సీట్ల సర్దుబాటు చేసుకోవడం కత్తిమీద సామే.
కాంగ్రెస్ సర్దుకుపోవాల్సిందే
‘‘బలమైన మోదీ సర్కారుపై పోరాడి గద్దె దించాలంటే విపక్షాలు ఎంతో కొంత త్యాగం
చేయాలి. పెద్ద పార్టీలు ఎక్కువగా త్యాగం చేయాల్సి ఉంటుంది’’ ..శుక్రవారం నాటి
భేటీ నేపథ్యంలో జేడీయూ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలివి. ఆయన పరోక్షంగా
కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది. కాంగ్రెస్ శ్రేణులకు ఇది
నిష్ఠురంగా అనిపించినా అదే నిజం. ఎందుకంటే ఈ భేటీలో పాల్గొనే విపక్షాలు ఉన్న
అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉనికి ఉంది. అలాగని పలు రాష్ట్రాల్లో అదే
ప్రధాన పార్టీగా లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది.
ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ వంటివి ఇందుకు ఉదాహరణ. కాబట్టి
ఎక్కువగా సర్దుకుపోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే. అయితే, కాంగ్రెస్‌ను ఇతర
ప్రతిపక్షాలు ఈ భేటీల్లో అందుకు ఒప్పించగలవా లేదా వేచిచూడాలి.