జనార్ధన్
విజయవాడ : విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద గురువారం ఏపీయూడబ్ల్యూజే 66 వ్యవస్థాక
దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు
చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక
అధ్యక్షుడు మనికొండ చలపతిరావు చిత్రపటానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి చందు జనార్ధన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం
యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు పత్రికా
స్వేఛ్చను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి ఏటా జర్నలిస్టులపై
దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు
నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. వాస్తవాలు రాసే జర్నలిస్టులను
బెదిరించడం, అక్రమ నిర్భందాలకు పాల్పడటం ద్వారా పత్రికా స్వేచ్ఛను
హరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఏదో ఒక చోట
జర్నలిస్టులపై నిత్యం దాడులు జరగడం అనివార్యంగా మారిందని, ఈ దాడులను
అరికట్టాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ద్వారా పత్రికా స్వేచ్ఛ కు విఘాతం
ఏర్పడుతుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనేది కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం,
వారి హక్కుల పరిరక్షణ కోసం నాటి సీనియర్ జర్నలిస్టు మనికొండ చలపతిరావు 1957లో
స్థాపించడం జరిగిందని వివరించారు.
అనంతరం గత 66 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, సంక్షేమం కోసం అనేక
చారిత్రాత్మక ఉద్యమాలు నిర్వహించిందని వివరించారు. ఏపీయూడబ్ల్యూజే వర్ధిల్లాలి
అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు
మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతతోనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఏపీయూడబ్ల్యూజే 67 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల ఉద్యమ
బలోపేతానికి శపథం పూనాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె
జయరాజ్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్
క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు కృష్టారావు, స్సామ్నా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దారం
వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు, విజయవాడ యూనిట్ కమిటీ సభ్యులు పి
సురేంద్ర, రఘురాం, టి శివరామకృష్ణ,ఎంవీ సుబ్బారావు, జనజ్వాల శ్రీనివాసరావు,
ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు విజయ భాస్కరరావు, రూబేను, నారాయణ తదితరులు
పాల్గొన్నారు.
అన్నదానం : ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం
భవానీపురంలోని వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ సభ్యులందరూ పాల్గొని అన్నదానం చేశారు.