విశాఖపట్నం : ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాలన్నారు రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. వైసీపీ ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ఈ ఏడాది ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని సీఎం జగన్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బహిరంగ లేఖ రాశారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమక్షంలో మాట్లాడుతూ ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ మరుగున పడిపోయిందని విమర్శించారు. ఐటీ పాలసీని ఆచరణలోని తీసుకొచ్చి పరిశ్రమల కోసం శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. స్టార్టప్స్ కోసం ప్రభుత్వం సహకారం అందించాలని వెల్లడించారు. ఐటీ కంపెనీలకు ఇన్సెంటివ్స్ రూపంలో 90కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వ పాలన లోపాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తామని గుర్తుచేశారు. ఓటు బ్యాంకింగ్ రాజకీయాలపై ధ్యాస పెట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవాలని అన్నారు. అనంతరం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఎంపీ నరసింహారావు కార్యకర్తలు, బీజేపీ నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.