కేసీఆర్ కు నిర్మలా సీతారామన్ కౌంటర్
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ… కేంద్రం చెబుతున్న ఐదు ట్రిలియన్ల
ఆర్థిక వ్యవస్థ ఓ జోక్ అని కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తప్పుబట్టారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక
వ్యవస్థపై జోకులొద్దని హితవు పలికారు. గణాంకాలు చూసి మాట్లాడితే బాగుంటుందని
అన్నారు. 2014లో తెలంగాణ బడ్జెట్ రూ.60 వేల కోట్లు అని, ఇప్పుడది రూ.3 లక్షలకు
దాటిందని గుర్తు చేశారు. ఇదంతా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం కాదా? అని
ప్రశ్నించారు. దేశ ప్రగతిలో ఎలా భాగస్వాములు కావాలని ఆలోచించకుండా, దేశ
ఆర్థికవ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సరికాదని అన్నారు. ఆర్థిక
వ్యవస్థను జోక్ అంటున్నారంటే ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనను అవమానించడమేనని
నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అనేది ఏ
ఒక్కరి కోసమో కాదని, దేశం కోసమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాలల
అంశంపైనా నిర్మల స్పందించారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో
కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే కాలేజీలు ఉన్న చోట మళ్లీ
కాలేజీలు పెట్టేందుకు ప్రతిపాదనలు పంపడాన్ని ఏమనాలి? అంటూ నిలదీశారు.