సురేష్
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ సమక్షంలో ఒప్పంద
పత్రాలు మార్చుకున్న ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ
అయ్యుబ్ హుసేన్
ఐ.టీ, పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యానికి సంబంధించిన బ్రోచర్ విడుదల
నైపుణ్య శాఖ సెక్రటరీ, ఎండీలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’డేటావివ్’
ప్రతినిధుల సమావేశం
అమరావతి : సమాచార సాంకేతిక రంగంలో మైనారిటీకి చెందిన నిరుద్యోగులకు శిక్షణ,
ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీఎస్ఎస్డీసీ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది
సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి
సురేష్ సమక్షంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ అయ్యుబ్
హుసేన్ లు సంతకాలు చేసి..ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర
వ్యాప్తంగా 26 జిల్లాలకు గానూ ఉర్దూ అకాడమీకి సంబంధించిన 36 శిక్షణ కేంద్రాలను
స్కిల్ హబ్ లుగా మార్చుకుని యువతకు శిక్షణ కార్యక్రమాలను అందించే దిశగా
ఒప్పందం కుదిరిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ వెల్లడించారు. ఇప్పటికే
ఉన్న 60 మంది అకాడమీ శిక్షకులకు పైన శిక్షణనిచ్చే వారిని ఏపీఎస్ఎస్డీసీ
నియమించి..స్కిల్ డెవలప్ మెంట్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణనందించే దిశగా
రెండు సంస్థలు భాగస్వామ్యమైనట్లు ఏపీఎస్ఎస్డీసీ సంస్థ ఎండీ వినోద్ కుమార్
స్పష్టం చేశారు.
ఐ.టీ, పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యానికి సంబంధించిన ‘బ్రౌచర్’ విడుదల
నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఐ.టీ, పరిశ్రమలతో
ఏపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యానికి సంబంధించిన బ్రోచర్ విడుదల జరిగింది.
తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా
మండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం, త్వరలోనే
యువతకు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నట్లు ముఖ్య కార్యదర్శి సురేష్
వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఐటీ, పరిశ్రమల రంగాల్లో
ఇంజినీరింగ్ యువత నైపుణ్య శిక్షణ పొందే వీలుగా ఈ కార్యక్రామానికి శ్రీకారం
చుట్టినట్లు ఎండీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా
అనాలిసిస్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ మెంట్, బిల్డ్ బాక్స్, 3డీ ఆధారిత
గేమ్ డిజైన్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,క్లౌడ్ కంప్యూటింగ్, ఆటో క్యాడ్ ఆధారిత
బిల్డింగ్ డ్రాఫ్టింగ్, పీఎల్ సీ తో ఇండస్ట్రియల్ ఆటోమేషన్,వెబ్ డెవలప్ మెంట్
తదితర కోర్సులలో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం
చేశారు. ఈ విద్యా సంవత్సరానికి గానూ జావ, డేటాబేస్, క్లౌడ్ కోర్సులందించే
ఒరాకిల్ అకాడమీ, ఆర్ పీఏ, డిజైన్, డెవలప్మెంట్ అందించే యుఐ పత్, ఎడ్యునెట్
టెక్ సాక్ష్యం, ఐబీఎం స్కిల్ బిల్డ్, ఏడబ్ల్యూఎస్ అకాడమీ,సీ డాక్ నేతృత్వంలో
బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ డెవలప్ మెంట్ వంటి పరిశ్రమలకు అవసరమైన
నైపుణ్య శిక్షణ పొంది యువత ఉద్యోగాలు పొందే విధంగా భాగస్వామ్యం అయినట్లు ఎండీ
వినోద్ తెలిపారు.
నైపుణ్య శాఖ సెక్రటరీ, ఎండీలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’డేటావివ్’
ప్రతినిధుల సమావేశం
నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ లతో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘డేటావివ్’టెక్నాలజీస్ ఎండీ వేదాంత్
అహ్లువాలియా, బోర్డు సలహాదారు అతుల్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ల్యాబ్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు ఎండీ
వేదాంత్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్య, శిక్షణ
కార్యక్రమాలు బాగున్నాయని ప్రతినిధులు ప్రశంసించారు. భవిష్యత్ లో ఎంతో స్కోప్
ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్,
మెటావెర్స్ సిమ్ములేషన్స్,గ్రేడింగ్, అసెస్ మెంట్ వంటి అత్యాధునిక సదుపాయాలతో
ల్యాబ్ ఏర్పాటుకు ఏపీతో భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ల్యాబ్ ద్వారా భావోద్వేగాలను ఇంటెలిజెన్స్ కెమెరాల ద్వారా పసిగట్టవచ్చని
ఎండీ వేదాంత్ వివరించారు.కృత్రిమ మేధ ద్వారా టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫోటోల
ద్వారా అర్థం చేసుకునేలా యువతకు టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. బాడీ
డిటెక్షన్, వర్చువల్ ఆబ్జెక్ట్ మేనిప్యులేషన్, న్యాచురల్ లాంగ్వేజ్
అండర్స్టాండింగ్ వంటి ప్రక్రియల వల్ల అన్నింటినీ స్పృశిస్తూ నేర్చుకోవడం
యువతకు మరింత ప్రత్యక్ష్యంగా తెలుసుకోవడం సాధ్యమన్నారు. మహారాష్ట్రలోని
బారామతిలో గౌతమ్ అదానీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఆధ్వర్యంలో
ఇప్పటికే టెక్నాలజీ డెమన్ స్ట్రేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని రూ.2కోట్లతో
ఏర్పాటు చేసినట్లు నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆ సంస్థ ప్రతినిధులు
వివరించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి
సురేష్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో వినోద్ కుమార్, నైపుణ్య శాఖ మంత్రి
ఓఎస్డీ కార్తికేయ, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు క్రాంతి, దినేశ్
కుమార్, కోటి రెడ్డి, సీజీఎం(టెక్నికల్) రవి గుజ్జుల తదితరులు పాల్గొన్నారు.