అమెరికాకు చెందిన రేమండ్ రోబర్ట్స్ అనే వ్యక్తి ఏకంగా ఆరు లాటరీలు గెలుచుకున్నాడు. వీటి మొత్తం విలువ 20 లక్షల డాలర్లకు పైగానే ఉంది. ఒక్క లాటరీ గెలిస్తేనే ఎంతో సంబరపడిపోతాం. ఆ డబ్బుతో ఏం చేయాలా? అని తెగ ఆలోచించేస్తాం. కానీ, అమెరికాకు చెందిన రేమండ్ రోబర్ట్స్ ఒకటి..రెండు కాదు.. ఏకంగా 6 లాటరీలు గెలుచుకున్నాడు. వీటి మొత్తం విలువ దాదాపు 20 లక్షల డాలర్లు పైగానే ఉంది. తాజాగా డిసెంబరు 14న నిర్వహించిన డ్రాలో ఏడాదికి 25 వేల డాలర్ల చొప్పున 20 ఏళ్లపాటు చెల్లించే లాటరీని రేమండ్ రోబర్ట్స్ గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. అయితే, అతడు కొనుగోలు చేసి గెలుపొందిన టికెట్లలో మొదటి ఐదు అంకెలు ఓకేలా ఉండటం గమనార్హం. టికెట్ల ఎంపిక విషయంలో తన అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకున్నానని రోబర్ట్స్ చెబుతున్నాడు. తన బంధువుల, కుటుంబ సభ్యుల పుట్టిన రోజులు, వార్షికోత్సవాల తేదీలు కలిసేలా టికెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. గత 20 ఏళ్లుగా రేమండ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు లాటరీల్లో గెలుచుకున్న మొత్తంలో 3,90,000 డాలర్లను నగదు రూపంలో తీసుకోగా చివరి లాటరీని మాత్రం ఏడాదికి 25 వేల డాలర్ల చొప్పున 20 ఏళ్లపాటు చెల్లించేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నాడో మాత్రం రేమండ్ వెల్లడించలేదు. కానీ, తన కోసం ఓ మోటారు సైకిల్ని మాత్రం కొనుక్కుంటానని అన్నాడు. అంతేకాకుండా రేమండ్ కొనుగోలు చేసిన టికెట్లపై 30 వేల డాలర్ల బోనస్ కూడా పొందినట్లు లాటరీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు లాటరీల వల్ల సమయం, డబ్బు వృథా అవడం తప్ప ఇంకేం ఉపయోగం లేదని గత నెలలో వ్యాఖ్యానించిన డానీ జాన్సన్ అనే వ్యక్తి తాజా లాటరీలో 1,50,000 డాలర్లు (దాదాపు రూ.1.22 కోట్లు) గెలుచుకోవడం గమనార్హం.