రైలు ప్రమాద వార్త కలచివేసిందన్న అదానీ
తల్లిదండ్రులను కోల్పోయిన బాలల విద్యా ఖర్చులు పూర్తిగా భరిస్తామని వెల్లడి
ప్రముఖ వ్యాపారవేత్త, సంపన్నుడు గౌతమ్ అదానీ పెద్ద మనసు ప్రదర్శించారు. ఒడిశా
రైలు ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రైలు ప్రమాద
వార్త తనను కలచివేసిందని వెల్లడించారు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను
కోల్పోయిన బాలల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే భరిస్తామని అదానీ
ఓ ప్రకటనలో తెలిపారు. ఆ పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడం తమ బాధ్యతగా
భావిస్తామని వివరించారు. రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడం మనందరి సమష్టి బాధ్యత
అని అదానీ పిలుపునిచ్చారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఆగివున్న గూడ్స్
రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనగా, చెల్లాచెదురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్
బోగీలను మరో లైన్ లో వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం
జరగడం తెలిసిందే. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో 275 మంది కన్నుమూశారు.