శ్రీకాకుళం : ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా వరసగా ఎనిమిదో సారి
కూడా ధర్మాన కృష్ణ దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1994 నుంచి ఇప్పటివరకు ఆయన
ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికవుతూ మూడు దశాబ్దాలుగా
సుదీర్ఘకాలం ఆ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. శ్రీకాకుళం
నగరంలోని గురిటి పోలమ్మ ఆలయ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఒలింపిక్ అసోసియేషన్
నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ లో ఉన్న ఒక్కొక్క పదవికి
ఒక్కొక్కరే నామినేషన్ను దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు బివి రమణ, కే. గోపి,
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మోహన్ వెంకట్రావులు ఈ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు
ప్రకటించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా వరుసగా 8వ సారి ధర్మాన కృష్ణ
దాస్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి గా
మెంటాడ సాంబమూర్తి, కోశాధికారిగా యాళ్ల పోలినాయుడు, ఉపాధ్యక్షులుగా శిమ్మ
రాజశేఖర్, మెంటాడ పద్మనాభం, చిట్టి నాగభూషణం, బిఏ లక్ష్మణ దేవ్, కే ఎన్ ఎస్ వి
ప్రసాద్, కే మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శులుగా పీ.తవిటయ్య, ఎంవి రమణ,
కొమర భాస్కరరావు, ఎస్ శ్రీనివాసరావు, ఎం ఎస్ సి శేఖర్, కార్యవర్గ సభ్యులుగా
రెడ్డి శివకుమార్, కొండపల్లి రవికుమార్, సిగిలిపల్లి లక్ష్మీదేవి, బాడన
నారాయణరావు, ఎస్వి జగన్నాథం, పైడి గోవిందరావులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో
ఉన్నారు. రాజకీయలకు, కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఉన్నవి ఒక్క క్రీడలు
మాత్రమేనని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి
ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఉద్దేశిస్తూ
కృష్ణదాస్ మాట్లాడుతూ తనను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకోవడం బాధ్యతను మరింత
పెంచుతుందని చెప్పారు. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో క్రీడలలో మంచి
ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తున్నారని
కొనియాడారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని విద్య నేర్పిన గురువులు,
తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందిస్తే మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఈ
సందర్భంగా ఆకాంక్షించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం
చేస్తున్న కృషిని గురించి ఈ సందర్భంగా కృష్ణ దాస్ వివరించారు.