న్యూఢిల్లీ : ప్రజల మద్దతు కూడగట్టుకొని వారి మద్దతుతో జరగాల్సిన ఎన్నికల
యుద్దాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం టీవీ స్టూడియోలు, ఓటీటీ
ప్లాట్ ఫాంలు, ప్రత్రికల ముందు చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
శుక్రవారం పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రత్యర్థితో ముఖాముఖి
కాకుండా మదిలో ఊహించుకొని నీడలతో చేసే పోరులో ఓటమి మాట దేవుడెరుగు ఉనికినే
కోల్పోతారని అన్నారు.
వివిఐఎల్ ప్రోగ్రాం విద్యార్దులకు అద్భుత అవకాశం
వివిఐఎల్ (విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్) ప్రోగ్రాం రాష్ట్ర
విద్యార్దులకు అద్భుత అవకాశమని విజయసాయి రెడ్డి అన్నారు. 60 నెలల కాలపరిమితితో
రూపొందించిన కోర్సు బీఎస్సీ, బీసీఏ అభ్యర్దులకు అద్బుత అవకాశమని ప్రతినెలా
స్టైఫండ్ అందించడంతో పాటు బిట్స్ పిలానీ నుంచి ఎంటెక్ పొందే అవకాశం
లభించనుందని అన్నారు. కనీసం 5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుందని
ఆయన అన్నారు. యూట్యూబ్ సీఈఓ గా నియమితులైన నీల్ మోహన్ కి అభినందనలు
తెలియజేశారు. ప్రపంచ మల్టీనేషనల్ కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు మరో
ఇండియన్-అమెరికన్ సారధ్యం వహించడం గర్వకారణమన్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్,
గూగుల్, ఎడోబ్, ఐబీఎం, స్టార్ బక్ వంటి దిగ్గజ కంపెనీలకు ఇండియన్ -అమెరికన్
సంతతికి చెందిన వ్యక్తులు అత్యున్నత స్థానంలో సేవలందిస్తున్నారని, యువతకు
ప్రేరణ కలిగించడంతో వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కేవలం రెండు వారాల
వ్యవధిలోనే ఇద్దరు హృద్రోగులకు విజయవతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స
నిర్వహించిన పూణేలోని ఏఐసీటీఎస్ (ఆర్మీ ఇన్సిట్యూట్ ఆఫ్ కార్డియో థోరాసిక్
సైన్స్) వైద్యుల సేవలు గర్వకారణమని అన్నారు. ఈ సంస్థ అందించే అధునాతన వైద్య
సదుపాయాలు సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని
అన్నారు.