న్యూఢిల్లీ : ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఉచితాలు అని, సంక్షేమ పథకాలు మాత్రం ప్రజల సమ్మిళిత వృద్ధి కోసం చేసేవని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఉచిత హామీలపై అడిగిన సూచనలపై బీజేపీ తన వైఖరిని తెలియజేస్తూ ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఉచితాలు, సంక్షేమానికి మధ్య స్పష్టమైన తేడా ఉందని భారతీయ జనతా పార్టీఅభిప్రాయపడింది. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఉచితాలని,
సంక్షేమం మాత్రం ప్రజల సమ్మిళిత వృద్ధికేనని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. ఎన్నికల నియమావళిలో మార్పుల ప్రతిపాదనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ అభిప్రాయాలను ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో భాజపా తన వైఖరిని తెలియజేసింది.‘ఉచితాలు అనేవి ఓటర్లను ఆకర్షించడానికి చేసేవి. అదే సంక్షేమం మాత్రం సమ్మిళిత వృద్ధి కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయం. ఈ క్రమంలో ఓటరు సాధికారతకే ప్రాధాన్యం ఇవ్వాలి, వారి శక్తి సామర్థ్యాలను పెంచడం, ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించడంపై దృష్టి సారించాలి’ అని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి భాజపా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు ఆర్థికంగా ఎలా సాధ్యమనే విషయాన్ని పార్టీలు తెలియజేయాలనే ఎన్నిక సంఘం ఆలోచనపైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
అంతేకాకుండా ప్రజలకు ఇళ్లు, ఉచిత రేషన్ ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉంటే, ఉచితంగా విద్యుత్ ఇవ్వడమనేది మరో లక్ష్యంతో కూడుకున్నదని బీజేపీ అభిప్రాయపడింది. ఉచితాలపై ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి కూడా ఇదేనని ఈసీకి రాసిన లేఖ రూపకల్పనలో ఒకరైన పార్టీ సీనియర్ నేత వెల్లడించారు. ఇదిలాఉంటే, ఉచితాలపై ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ అక్కడి ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడాన్ని ఇటీవలే మొదలుపెట్టింది. త్వరలోనే ఎన్నికలు జరిగే గుజరాత్‌లోనూ రాజకీయ పార్టీలు ఇస్తోన్న హామీలపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉచితాలు, సంక్షేమ పథకాలపై రాజకీయ పార్టీల వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కోరింది. ఇందుకు సంబంధించిన గడువు అక్టోబర్ 19కే ముగిసింది.