మచిలీపట్నం : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా సర్కులర్ ప్రకారం ఓటర్ల
జాబితాలో తొలగింపుల ప్రక్రియను వారం లోగా సజావుగా పూర్తి చేయాలని జిల్లా
ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఎన్నికల అధికారులను
ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి క్షేత్రాధికారులతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ
కార్యక్రమం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. నియోజకవర్గాల
వారీగా ఈఆర్వోలు(ఓటరు నమోదు అధికారులు), ఏ ఈ ఆర్ ఓ లు, సూపర్వైజర్లు,
బిఎల్వోలు తాజా సూచనలు ఎంత మేరకు గ్రహించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త
సవరణ కార్యక్రమం భౌతికంగా నూరు శాతం పూర్తయిందని, ఆన్లైన్లో 97% పూర్తయిందని
భౌతికంగా చేసిన మిగిలిన మూడు శాతాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ
సవరణ కార్యక్రమం సంబంధించి అన్ని రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. భారత
రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ప్రాథమిక హక్కుని, సరైన కారణాలు లేనిదే ఏ ఒక్కరి
ఓటును తొలగించరాదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఓటర్ల తొలగింపు
ప్రక్రియను తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. ఓటును తొలగించే ముందు తప్పనిసరిగా
సంబంధిత ఓటరుకు నోటీసు పంపించాలని సూచించారు. లేనిపక్షంలో సంబంధిత ఈఆర్ఓ లను
సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. భారత ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం
ఓట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారికి
సంబంధించి ఈఆర్వో నెట్ వెబ్సైట్ నుండి ఫారం-ఏ, కన్ఫర్మేషన్ లేఖ జనరేట్
చేసుకుని సంబంధిత ఓటరుకు రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసు పంపించి రసీదు
పొందాలన్నారు. వారికి 15 రోజుల సమయం ఇవ్వాలని ఆలోగా వారి నుండి కన్ఫర్మేషన్
లేఖ రాని పక్షంలో బిఎల్ఓ లను పంపించి తెప్పించుకోవాలన్నారు.
అలాగే శాశ్వత వలస ఓటర్లకు సంబంధించి ఈఆర్ఓ నెట్ వెబ్సైట్ ద్వారా ఫారం-బి,
కన్ఫర్మేషన్ లేఖలు జనరేట్ చేసుకొని సంబంధిత ఓటరుకు అతని చివరి చిరునామాకు
రిజిస్టరు పోస్టు ద్వారా నోటీసు పంపించి రసీదు పొందాలన్నారు. 15 రోజుల్లోగా
అతని నుండి ఎటువంటి సమాచారం రాకపోతే తప్పనిసరిగా బిఎల్ వో ను పంపించి విచారణ
జరిపి తొలగించాలన్నారు. మృతి చెందిన ఓటర్లకు సంబంధించి బి ఎల్ ఓ లు మరణ
ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని లేనిపక్షంలో నోటీసులు పంపించి ఆయా పంచాయితీలో
ప్రదర్శనకు ఉంచి 7 రోజుల సమయం ఇవ్వాలని అప్పటికీ స్పందించకపోతే పంచనామా చేసి
ఓట్లను తొలగించాలన్నారు. తొలగించిన ఓట్లను ఎవరైనా తిరిగి చేర్చాలని
కోరినప్పుడు సెక్షన్ 24 ప్రకారం అన్ని విధాల పరిశీలించి నిజమైన ఓటర్ అయితే
ఫారం-6లో తిరిగి నమోదు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.అన్ని ఫారములు
సజావుగా భర్తీ చేయాలని అవి పూర్తిగా గమనించే ఈఆర్వోలు ఏఈఆర్వోలు సంతకం
చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం కింద 4837 దరఖాస్తులకు గాను ఇంకను పెండింగ్‌లో
ఉన్న 2385 దరఖాస్తుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలు తాసిల్దారులు వెంటనే అప్లోడ్
చేయాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఈఆర్ఓలు, తహసీల్దారులు ఎంపీడీవోలు,
మునిసిపల్ కమిషనర్లు, సూపర్వైజర్లు, బిఎల్వోలు తదితర అధికారులు పాల్గొన్నారు.