అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారికి న్యాయం జరిగేలా చూస్తాం
ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా అనేక
అర్ధికేతర సమస్యలను చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా అపరిస్కృతంగా ఉన్నాయని వారికి
అండగా ఉంటూ, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి, వాటి పరిష్కారమే లక్ష్యంగా
ఏపీజేఏసీ అమరావతి ఇప్పటికే ప్రకటించినట్లు ఇక నుండి పనిచేస్తుందని చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
కే.సుమన్ పేర్కొన్నారు. ఏపీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర
కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ లెనిన్ సెంటర్ నందు గల రెవెన్యూ భవన్లో
వేతనాలు సమస్య ఉన్న పలు శాఖల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ
ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక శాఖల్లో పనిచేసే సంబంధిత శాఖ
కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన
మీదట ప్రధాన, న్యాయబద్ధమైన సమస్యలను కొన్ని గుర్తించారు.
వాటిలో కాంట్రాక్ట్ విధానం ద్వారా పశుసంవర్థక శాఖ లో పనిచేస్తున్న పారామెడికల్
స్టాఫ్ (లాబ్ టెక్నిషియన్స్) , ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లాబ్
అటెండెంట్ లకు పెంచిన జీతాలు సంవ త్సరకాలంగా (1-1-2022 తో 1-1-2023వరకు)
చెల్లించి, ఆర్ధిక శాఖ ఆమోదం లేదని, ఉద్యోగులు చేయని తప్పుకు ఫిబ్రవరి-2023
నుండి తిరిగి పాత జీతాలు చెల్లించడం చాలా దారుణమని, ప్రభుత్వం స్పష్టంగా
మినిమం టైం స్కేల్ వర్తింప చేయమని ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కేవలం
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తక్కువ వేతనాలు గత నాలుగు మాసాలుగా పొందడమే
కాకుండా, గత సంవత్సరం చెల్లించిన వేతనాలు రికవరీ చేయాలని ట్రెజరీ అధికారులు
నిర్ణయిస్తున్నారని, కనుక తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అరియర్స్ తో సహా
గత సంవత్సరం వలే కొత్త వేతనాలను చెల్లించాలని కోరారు. అలాగే చైల్డ్
ప్రొటెక్షన్ సర్వీస్ కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
చిల్డ్ ప్రొటెక్షన్ సెంటర్స్ లలో పనిచేసే ఉద్యోగులకు ప్రధానంగా “సోషల్
వర్కర్”, “ఔట్ రిచ్ వర్కర్స్”, “డేటా ఎంట్రీ ఆపరేటర్” , “ఆయా”లకు చాలా
తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో 2019 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 9
నెలల పాటు ఎంటీఎస్ చెల్లించి తర్వాత నిలుపుదల చేసి (కేంద్ర ప్రభుత్వం ఆమోదం
లేదని), ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చాలీ చాలని అతి తక్కువ
జీతాలు చెల్లిస్తున్నారని, పైన తెలిపిన కేటగిరీ ఉద్యోగులకు జీతాలు పెంపుదల
చేయాలని కోరారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ లో అనేక సంత్సరాలపాటు గా
కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న “కోచ్” లకు అతి తక్కువ వేతనాలు
చెల్లిస్తున్నారని, వారికి కూడా ఎంటీఎస్ అమలు చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో
వాచ్, వార్డ్ గా శ్రీకాకుళం, అనంతపురము, కృష్ణా, కర్నూల్ జిల్లాలలో
పనిచేస్తున్న వందలాది మందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదని,
ఏమీ చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ
తరపున ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన బోధనసుపత్రులలో పనిచేసే ఔట్ సోర్సింగ్
ఉద్యోగులు గత సంవత్సరం అక్టోబర్ – 2022 లో నియమించబడిన రోజు నుండి నేటికీ
జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
చైర్మన్ కే సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ ప్రతినిధులను
ఉద్దేశించి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు.
ఏపీ జెఎసి అమరావతి ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన 92 రోజులు ఉద్యమంలో చాలా
సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఇకనుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను
ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి
కృషి చేస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులకు ప్రధానంగా
క్లాస్-4, డ్రైవర్ లాంటి చిరు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం
దారుణమని ఈ విషయాన్ని కూడా బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అర్హత ఉండి
ప్రభుత్వ పథకాలు అందని వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇక నుండి శాఖల
వారీగా అపరిష్కృతంగా న్యాయబద్ధంగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
సమస్యలను కూలంకుషంగా తెలుసుకుని, న్యాయబద్దంగా, అపరిష్కృతంగా ఉన్న విషయాలను
ప్రభుత్వం దృష్టిలో పెట్టి , పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ
సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి అల్లం సురేష్ బాబు ,పూర్వపు కార్యదర్శి బానోజీరావు, కో చైర్మన్
అనిల్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ దివాకర్ బాబు, వెటర్నరీ, ఐసిపిఎస్,
శ్రీకాకుళం రిమ్స్, క్రీడాభివృద్ధి సంస్థ, డిఎంఈ, సాంఘిక సంక్షేమ శాఖల ఉద్యోగ
ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.