విజయవాడ : రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తోన్న కందిపప్పు అక్రమాలపై
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు.
కందిపప్పులో నాణ్యత లోపించడం, కిలో 67 రూపాయల వంతున ఆఫ్రికా నుంచి కొనుగోలు
చేసి 120 రూపాయలకు సరఫరా చేయడంపై మంత్రి ఆరా తీశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్
అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తో శుక్రవారం సమావేశమైన మంత్రి ఈ
కందిపప్పు గోల ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఎక్కడ నుంచి
సేకరిస్తున్నారు. ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే వివరాలన్నీ రెండు రోజుల్లో తన
ముందు ఉంచాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లోని స్టాక్ పాయింట్లలో ఏమైనా
గోల్ మాల్ జరుగుతుందా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక పంపించాలని
స్పష్టం చేశారు. అవకతవకలు, అక్రమాలు జరిగాయని తేలితే ఎంతటివారైనా ఉపేక్షించేది
లేదని, అక్రమార్కుల తాట తీస్తామని మంత్రి హెచ్చరించారు.