ఆర్టీసీ బిల్లు వివాదం పై రాజ్ భవన్ ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ నినాదాలు
రాజ్ భవన్ వద్ద భద్రత పెంచిన ప్రభుత్వం
కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళిసై చర్చలు
గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు : సానుకూల స్పందన
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం
చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. నెక్లెస్ రోడ్ మీదుగా
ర్యాలీగా వచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ ముందు బైఠాయించారు.
బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని నినాదాలు చేస్తున్నారు.
బిల్లులో అంశాలపై వివరణ సంగతి తర్వాత చూడొచ్చు ముందు బిల్లుకు ఆమోదం తెలపాలంటూ
ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు
పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్
ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపారు.
కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే
ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ఉదయం ట్విట్టర్ లో
వెల్లడించారు. ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఐదు అంశాలపై స్పష్టత ఇవ్వాలని
ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం వివరణ
పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కార్మిక సంఘాల చర్చల తర్వాత
ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్
ఆమోదం తెలిపిన వెంటనే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్
చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు
ముగియనుండడంతో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ప్రభుత్వానికి ఇవే చివరి
సమావేశాలు కావడంతో ఆర్టీసీ బిల్లును పాస్ చేయించాలని ప్రయత్నిస్తోంది.
శాసనసభలో ఆర్టీసీ బిల్లు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆ సంస్థ
కార్మికులు కదం తొక్కారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్
చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
బిల్లును గవర్నర్ ఆపడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 నుంచి 8
గంటల వరకు ఆర్టీసీ డిపోల వద్ద బంద్ పాటించిన కార్మికులు ఆ తర్వాత నెక్లెస్
రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వందలాదిగా
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో
రాజ్‌భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గవర్నర్ సానుకూలంగా స్పందించారు : అయితే ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ తమిళి సై ఇదే సమయంలో ఆ సంస్థ
ఉద్యోగులతో చర్చలకూ సిద్ధమయ్యారు. రాజ్‌భవన్‌కు తరలివచ్చిన ఆర్టీసీ యూనియన్
నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని తెలిపారు.
దీంతో టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్.రెడ్డి, థామస్‌రెడ్డి సహా 10 మంది
సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని,
సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వివరణ
తనకు ఇంకా అందలేదని, వివరణ అందిన తర్వాత బిల్లు ఆమోదిస్తానని తెలిపారన్నారు.
కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు.
త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు థామస్‌రెడ్డి
వెల్లడించారు.
*గవర్నర్ నిర్ణయం చరిత్రాత్మకం : అశ్వత్థామరెడ్డి
గవర్నర్ లేవనెత్తిన 5 ప్రశ్నల్లో 4 కార్మికుల ప్రయోజనాలకు సంబంధించినవేనని
అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని
గవర్నర్ గుర్తుచేశారని చెప్పారు. ఆదరాబాదరాగా బిల్లు రూపొందిస్తే కార్మికులు
ఇబ్బందుల్లో పడతారని ఆమె చెప్పారని తెలిపారు. గవర్నర్ నిర్ణయం చరిత్రాత్మక
నిర్ణయమన్నారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు : ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల నిరసనతో రాష్ట్ర
వ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి
8 గంటల వరకు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఉదయాన్నే విధులకు
వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గమ్యస్థానాలకు
వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. 2 గంటల తర్వాత ఆర్టీసీ సర్వీసులను
పరిమిత స్థాయిలోనే ప్రారంభించింది. మరోవైపు, హైదరాబాద్‌లో కార్మికులు
రాజ్‌భవన్‌కు తరలివెళ్లడంతో ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి.