బీజేపీకి షాక్ తప్పదా?
బెంగుళూరు : ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల వాతావరణం ఉంది. అటు అధికార
బీజేపీ మళ్లీ గెలవాలని చూస్తుండగా ఇటు కాంగ్రెస్, జేడీఎస్ ఎలాగైనా అధికారం
చేజిక్కుంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కర్ణాటక రాజకీయ
చిత్రాన్ని చూస్తే.. 1985 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా
రెండు సార్లు అధికారాన్ని చేపట్టలేదు. ఈ సారి తిరిగి గెలిచి చరిత్ర
సృష్టించాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరి ఏం జరగనుందనేది
ఆసక్తికరంగా మారింది.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం కర్ణాటక
ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ప్రస్తుతమున్న
అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలం పార్టీ చూస్తుండగా గతంలో కోల్పోయిన
అధికారాన్ని ఈ సారి ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు
ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే కర్ణాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 1985
తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు
గెలిచింది లేదు. అక్కడ జరిగిన తొలి ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
సాధించగా.. అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొందింది.
తర్వాత నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో స్వతంత్రంగా
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు ఈ సంప్రదాయానికి చరమగీతం
పాడి చరిత్ర సృష్టించాలని బీజేపీ యోచిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికార
పార్టీ.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం మూడు దశాబ్దాలుగా
జరుగుతోంది. అక్కడి ఓటర్లు ప్రభుత్వాలను మార్చడం, వేరు వేరు పార్టీలకు
ఓటు వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వారి నాడి పట్టడం అన్ని
పార్టీలకు సవాలుగా మారింది.
ప్రారంభంలో కాంగ్రెస్ హవా
మొదటి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆరో అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ
రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసింది. తర్వాత 7, 8వ ఎన్నికల్లో జనతా పార్టీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన 9వ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్
అధికారాన్ని చేపట్టింది. పదోసారి జరిగిన ఎన్నికల్లో ఈ సారి జనతా దల్ విజయం
సాధించగా.. 11వ ఎలక్షన్లో హస్తం పార్టీ అధికారాన్ని తిరిగి అధికారాన్ని
చేజిక్కించుకుంది.
చేతులు మారిన అధికారం..
12వ సారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకసారి కాంగ్రెస్
– జేడీఎస్, మరోసారి బీజేపీ – జేడీఎస్ కూటములు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
అయితే.. తర్వాత జరిగిన 13వ శాసన సభ ఎన్నికల్లో తొలిసారి కమలం పార్టీ విజయం
సాధించింది. అనంతరం 14వ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి
వచ్చింది. 15వ ఎలక్షన్లలో రెండో సారి అస్థిరత ఏర్పడటం వల్ల కాంగ్రెస్ –
జేడీఎస్ లు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కొంత కాలం తర్వాత అది కూలిపోయి బీజేపీ
అధికారంలోకి వచ్చింది.కర్ణాటకలో 16వ అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ
మేరకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు అదే నెల 13న
వెల్లడించనున్నారు. మొత్తం 224 స్థానాలుండగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ
పూర్తయింది. అన్ని నియోజకవర్గాలకు కలిపి 3632 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈ
నెల 24తో వీటి ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర తిరిగి
రాయాలని కమాలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సంప్రదాయం ప్రకారం అధికారం చేతులు
మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూ బీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? అనేది మే
13న తేలిపోనుంది.