విజయనగరం : తెలుగువారి సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు
కన్నుల పండువగా జరిగాయి. స్థానిక శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో
సంక్రాంతి సంబరాలను మన సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వైభవంగా
నిర్వహించారు. ముందుగా భోగి మంటతో సంబరాలు ప్రారంభమయ్యాయి. హరిదాసు
కీర్తనలు, గంగిరెద్దులూ, గాలిపటాలు, బుడబుక్కలు, కోలాటాల నడుమ,
సాంస్కృతిక ప్రదర్శనలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజాప్రతినిధులు,
అధికారులు, మన సంప్రదాయ వస్తధారణతో వేడుకలకు హాజరై అలరించారు. ఈ
సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ పిండివంటల పోటీలు ఆకట్టుకున్నాయి.
మన సంస్కృతిని కాపాడాలి : డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిగా హాజరైన
కోలగట్ల మాట్లాడుతూ, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు.
రైతుల కష్టఫలం ఇంటికి చేరే రోజు కాబట్టి, సంక్రాంతి పండుగను తెలుగువారు
అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. రైతు బాగుంటేనే సమాజం
బాగుటుందన్నది సంక్రాంతి పండుగ చాటి చెబుతుందన్నారు. గతంతో పోలిస్తే మన
సమాజం ఆర్థికంగా అభివృద్ది చెందిందని, దాని ప్రభావం పండగపైనా
కనిపిస్తోందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో
పనిచేస్తూ, జిల్లా అభివృద్దికి కృషి చేయడం జరుగుతోందని కోలగట్ల అన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉన్నతాధికారులు సైతం తమ హోదాను
ప్రక్కనపెట్టి, ఈ సంబరాల్లో ఆడిపాడి అలరించారు. జిల్లా స్త్రీశిశు
సంక్షేమ, సాధికారతాధికారి బి.శాంతకుమారి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్
పద్మలత, ఎపిఎం సులోచన, ఐసిడిఎస్ ఉద్యోగి సుభాషిణి పాటలు పాడి
ఆకట్టుకున్నారు. మరో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుదర్శన దొర కర్రసాము
ప్రదర్శించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు
సంక్రాంతి నృత్యరూపకాలతో అలరించారు. రంగవల్లుల పోటీల్లో ప్రధమ,
ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సులోచన, ప్రవీణ, జ్యోత్స్న,
పాల్గొన్న ప్రతీఒక్కరికీ బహుమతులు అందజేశారు. వంటల పోటీల్లో రమణమ్మ,
దుర్గ, నాగమణి వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు
సుదర్శనదొర, సూర్యనారాయణ, పద్మలత, వెంకటేశ్వర్రావు, ఐసిడిఎస్
పిడి శాంతకుమారి, జిల్లా టూరిజం అధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, జిల్లా
పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్, మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్
ఆర్వి ప్రసన్నకుమారి విజేతలకు బహుమత్రి ప్రదానం చేశారు. రామవరం
హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తన వ్యాఖ్యానంతో అలరించారు. ఈ
కార్యక్రమాల్లో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సి డాక్టర్
పి.సురేష్‌బాబు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ కోలగట్ల
శ్రావణి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఆర్డిఓ ఎంవి సూర్యకళ,
వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.