విజయనగరం : రామతీర్ధంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర
విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామి వారి కల్యాణానికి ముత్యాల
తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. గోటి తో వొలిచిన 28 కేజీల
తలంబ్రాలను కల్యాణానికి వినియోగించారు. టిటిడి నుండి, సింహాచలం నుండి
విచ్చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం వైభోగంగా జరిగింది. ప్రముఖ
పండితులు మైలవరపు శ్రీనివాస రావు వ్యాఖ్యానం ఆద్యంతం సందేశాత్మకంగా
నిలిచింది. ఈ కల్యాణోత్సవం లో మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, వారి
కుటుంబ సభ్యులు, నెలిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు దంపతులు,
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, ఎం.ఎల్.సి డా.సురేష్ బాబు
పాల్గొన్నారు. తొలుత జె.సి. మయూర్ అశోక్, ఆర్.డి.ఓ సూర్య కళ, దేవస్థానం ఈ.ఓ
కిశోర్ తదితరులు పూర్ణ కుంభ స్వాగతం పలికి వేదం మంత్రాలతో మంత్రివర్యులు,
శాసన సభ్యులను , జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తిని దేవాలయంలో సీతారాముల
దర్శనానికి తీసుకు వెళ్ళేరు. అనంతరం కల్యాణ వేదిక వద్ద జరిగిన వేడుకలో
పాల్గొన్నారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులు
ఈ ప్రభుత్వం పైనా, రాష్ట్ర ప్రజలందరి పైనా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రామతీర్థం మరో
భద్రాచలంగా చెప్పుకోవచ్చునని, భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడా అలాంటి
సంప్రదాయంతో కళ్యాణోత్సవాలు నిర్వహించడం సంతోషాదాయకంగా ఉందని అన్నారు. ఈ
కార్యక్రమంలో పైడితల్లి దేవస్థానం ఈ.ఓ సుధారాణి, నెల్లిమర్ల మున్సిపల్
కమీషనర్, ఎం.పి.డిఓ, తహసీల్దార్, పలు ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.