కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 224
బీజేపీకి 65 నుంచి 75 స్థానాలు వస్తాయన్న సర్వే
కాంగ్రెస్ 114 వరకు సీట్లు వస్తాయని వెల్లడి
బెంగుళూరు : త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని
కోల్పోబోతోందని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 224
అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ కేవలం 65 నుంచి 75 స్థానాలకు మాత్రమే
పరిమితమవుతుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 108 నుంచి 114 స్థానాలకు కైవసం
చేసుకుంటుందని, దేవేగౌడ పార్టీ జేడీఎస్ కు 24 నుంచి 34 స్థానాలు లభించే
అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 38.14 శాతం నుంచి 40
శాతానికి పెరుగుతుందని, బీజేపీ ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతాయని
తెలిపింది. జేడీఎస్ కూడా 1.3 శాతం మేర ఓట్లను కోల్పోతుందని చెప్పింది.
కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన తరగతుల మద్దతు ఎక్కువగా
ఉంటుందని తెలిపింది. ఒక్కళిగ కులస్తుల్లో 50 శాతం మంది జేడీఎస్ కు, 38 శాతం
మంది కాంగ్రెస్ కు, 10 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
దావణగెరే, రాయచూరు, కోలార్, బళ్లారి, గంగావతి, కొప్పల్ నియోజకవర్గాల్లో
అభ్యర్థుల గెలుపు, ఓటములపై గాలి జనార్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కల్యాణ
రాజ్య ప్రగతి పక్ష ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఎస్ఏఎస్ గ్రూప్
హైదరాబాద్ కు చెందిన సంస్థ అనే విషయం గమనార్హం.