రానున్న 3 నెలలలో కార్యాచరణకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు
విజయవాడ : ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఆలోచనలు చేస్తూ మరింతగా ప్రణాళికలు
చేస్తూ ముందుకెల్తోంది. దానిలో భాగంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు బస్సు
సర్వీసులు పెంచే విధంగా అడుగులు వేస్తోంది. కర్నాటక ఆర్టీసీ తో ఏపీఎస్ ఆర్టీసి
కర్నాటక ఆర్టీసీతో ఇంటర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ రకాలుగా
ప్రయాణీకుల నుండి అభిప్రాయాలు సేకరించిన మేరకు కిలోమీటర్లు పెంచాలని ఏపీఎస్
ఆర్టీసీ నిర్ణయించి పలు దఫాలుగా అధికారులతో చర్చించారు. వరుస సమావేశాల
తర్వాత ఎట్టకేలకు గురువారం విజయవాడలో ఇరు ఆర్టీసీ ఎం.డి. ల మధ్య జరిగిన
సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆర్టీసీ హౌస్ ప్రధాన కాన్ఫరెన్స్
హాల్ లో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని
కొత్త రూట్ల ప్రతిపాదనలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత
ఈ ప్రతిపాదనలు తొలిసారిగా ఏపీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. ఏపీ ద్వారా 69,284
కిలోమీటర్లతో 327 బస్సులు పెంచాలని, అదేవిధంగా కర్ణాటక ద్వారా 69,372
కిలోమీటర్లతో 496 బస్సులను కొత్తరూట్లలలో పెంచడానికి ఇరు రాష్ట్రాల మధ్య
అంగీకారం కుదిరింది. ఈ ఎంఓయు అమలులోకి రావడంతో కర్ణాటకలో ఏపీఎస్ ఆర్టీసీ కి
చెందిన 1322 బస్సులు 2,34,762 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ లో కెఎస్ ఆర్టీసీ కి
చెందిన 1489 బస్సులు 2,26,044 కిలోమీటర్లు నడుస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య
ప్రజా రవాణా మెరుగుపరచడానికి చేసుకున్న ఈ రెండు ఎస్టియుల సిఫార్సులు సంబంధిత
ప్రభుత్వాల పరిశీలనకు సమర్పించబడతాయి. రానున్న 3 నెలల వ్యవధిలో కార్యాచరణ
అమలులోకి రావచ్చునని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి కెఎస్ ఆర్టీసీ ఎం
డీ వి.అంబు కుమార్, డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీటీఎం ఆపరేషన్స్
అంథోని జార్జ్, సీటీఎమ్ కమర్షియల్ ఎస్.రాజేష్ గురువారం విజయవాడలోని ఆర్టీసీ
హౌస్ ని సందర్శించారు. ఎం.డి. సి హెచ్. ద్వారకా తిరుమల రావు, ఈ అవగాహన
ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఆర్టీసీ పరస్పరం ఒడిస్సా మధ్య బస్సులు
పెంచేందుకు అంగీకరించి, ప్రభుత్వ సిఫార్సులు సమర్పించబడ్డాయి. ఈ ఇరు రాష్ట్రాల
అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా నడపవలసిన బస్సులు, రూట్ల జాబితాను డిసెంబర్ 12,
2022 న ప్రభుత్వం డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సమావేశంలో
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్),
ఏ.కోటేశ్వరరావు (అడ్మిన్), పి.కృష్ణ మోహన్ (ఇంజనీరింగ్), ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ రాఘవ
రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు, కర్ణాటక ఆర్టీసీ అధికారులు,తదితరులు
పాల్గొన్నారు.