టికెట్లు ఖరారు.. కుటుంబానికే ప్రాధాన్యం!
వచ్చే సంవత్సరం జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సమాయత్తం
అవుతున్నాయి. అందులో భాగంగానే జనతా దళ్(సెక్యులర్) తమ అభ్యర్థుల తొలి జాబితాను
విడుదల చేసింది. మొత్తం 93 మందికి చోటు కల్పించగా 32 మంది సిట్టింగ్
ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం జనతా
దళ్(సెక్యులర్) పార్టీ సన్నద్ధత ప్రారంభించింది. 2023 మే నెలలో అసెంబ్లీకి
ఎన్నికలు జరగనుండగా తాజాగా పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల
చేసింది. మొత్తం 93 మందికి ఇందులో చోటు కల్పించింది. రాష్ట్ర పార్టీ
అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఈ జాబితాను ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ
అధ్యక్షులు దేవెగౌడ అనుమతి అనంతరం జాబితాను విడుదల చేసినట్లు ఆయన
వెల్లడించారు. కాగా జాబితాలో గౌడ కుటుంబం నుంచి మూడవ తరానికి టికెట్
లభించింది. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ మనవడు, కుమార స్వామి తనయుడు నిఖిల్
పార్టీ కంచుకోట అయిన రామనగర నుంచి పోటీ చేయనున్నారు. 2019లో మండ్య లోక్‌సభ
స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీశ్
చేతిలో ఓడిపోయారు.
మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుతం ప్రాతినిధ్యం
వహిస్తున్న చన్నపట్నం నుంచే పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ
దేవేగౌడకు చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి టికెట్ లభించింది. ఆయన కుమారుడు
హరీశ్ గౌడకూ టికెట్ లభించింది. హున్సూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ
చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 32 మంది జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు
కేటాయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున మొత్తం 37 మంది
గెలుపొందారు. వీరిలో ఐదుగురు సభ్యులు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్,
కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అనంతరం
అప్పటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ వీరిపై అనర్హత వేటు వేశారు. ఆ తరువాత
కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి
వచ్చింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా మిగిలిన
131 స్థానాలకు రానున్న రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ
వర్గాలు వెల్లడించాయి.