హైదరాబాద్ : దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి
సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర
మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను
కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై
తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. అదే విధంగా ఢిల్లీ లోనూ
ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఢిల్లీ లో రెండు జాతీయ
పార్టీలను మట్టికరిపించి కేజ్రీవాల్ అద్భుత విజయం సాధించారు. ఢిల్లీ ప్రజా
ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా వేధింపులకు గురి చేస్తోంది.
కేంద్రప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఎన్నికైన
ప్రజాప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఒక ఆర్డినెన్సు తెచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేయకపోతే మరి దేనికి విలువ ఉంటుంది. అలంకార
ప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారు. కర్ణాటకలో ప్రజలు
కర్రుకాల్చి వాతపెట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు. ఎమర్జెన్సీని వ్యతిరేకించే
బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇందిరా గాంధీ అమలు చేసిన
ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోంది. బీజేపీకి ఢిల్లీ ప్రజలు
మరోసారి తగిన బుద్ధి చెప్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఢిల్లీ ప్రజలను
అవమానిస్తోంది. ఢిల్లీ విషయంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును వెంటనే
ఉపసంహరించుకోవాలి. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్ వచ్చిన తమకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారని తెలిపారు. ఢిల్లీ
సర్కార్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్‌తో చర్చించామని, ఆయన తమకు
మద్దతిస్తామని చెప్పారని అన్నారు. కేసీఆర్ జీ మోడీకి వ్యతిరేకంగా చాలా బలంగా
పోరాడుతున్నారని తెలిపారు. అనంతరం కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై, బీజేపీ
వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు
పాల్పడుతోంది. ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్సుతెచ్చింది.
ప్రభుత్వ అధికారుల విషయంలో దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోంది.
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కూడా కేంద్రం లెక్క చేయటం లేదు.
సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్సు తెచ్చింది. దిల్లీ
ప్రజలను మోదీ సర్కార్ తీవ్రంగా అవమానిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ
అరాచకాలు పెరిగాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీయేతర ప్రభుత్వాలను
కూల్చుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం
ఉంది. రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్‌ను కోరాను.
కేసీఆర్ మాకు మద్దతిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్ సీఎం
భగవంత్ మాన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు యుద్ధం చేయాల్సిన
పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్
పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలను
వేధించేందుకు గవర్నర్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ, తమిళనాడు,
కేరళ, బంగాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా చెప్పుకుంటాం.. భిన్న సంస్కృతులకు నిలయమైన
దేశంలో ఒకే విధానాన్ని బీజేపీ ఆశిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.