సింహాచలం : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ
వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బుధవారం పలు ఆర్జిత సేవలను అంగరంగ వైభవంగా
నిర్వహించారు. సింహాద్రి నాధుడి నిత్యకళ్యాణము తదితర సేవలకు భక్తులు పెద్ద
మొత్తంలో హాజరయ్యారు. నిత్య కళ్యాణం లో భాగముగా తొలుత సింహాద్రినాధుడు,
శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు.
అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. తదుపరి
స్వామి, అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించారు. వేద మంత్రోశ్చరణలు,
మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆస్థాన కళ్యాణ మండపంలో అందంగా తీర్చిదిద్దిన
కళ్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేశారు. విశ్వక్సేన, పుణ్యహవచనం,
ఆరాధన, కంకణదారణ,నూతన యజ్ఞోపవీతం, జిలకర్రబెల్లం తలంబ్రాల ప్రక్రియలను
శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నిత్యకళ్యాణంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యుడు
గంట్ల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులు స్వామిని దర్శించుకొని
సేవించుకున్నారు. ఆలయ ఏఇఓ వై. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని ఏర్పాట్లు
పర్యవేక్షించారు.