కవిత రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది.
మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే అసెంబ్లీ నుంచి బరిలో నిలుస్తారా? అనే చర్చ
మొదలైంది. గత ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిజామాబాద్
జిల్లాకు వచ్చిన సందర్భాలు తక్కువే. కానీ ఇటీవల వరుస పర్యనటలు, కుల సంఘాలతో
సమావేశాలు నిర్వహిస్తూ చురుగ్గా వ్యవరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా
మారింది.
కల్వకుంట్ల కవిత రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారు? గతంలో
మాదిరిగా మరోసారి నిజామాబాద్ పార్లమెంటు నుంచే బరిలో దిగుతారా? లేకుంటే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి అదృష్టాన్ని
పరీక్షించుకుంటారా? ఇప్పుడు ఇదే అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చగా
మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీ
చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ కోడలు కల్వకుంట్ల కవిత బీజేపీ
అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా అంతగా
చురుగ్గా కనిపించలేదు. ఎన్నికల ఫలితాల గురించి సైతం ఒక్క మాట మాట్లాడలేదు.
దాదాపు రెండేళ్లు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో గానీ, జిల్లా పర్యటనకు గానీ
రాలేదు. జిల్లా రాజకీయాల వైపు అసలు దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా
ఎంపికవడంతో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. తర్వాత
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ విచారణతో జిల్లాకు సమయం కేటాయించే అవకాశం
రాలేదు. అయితే ఇటీవల కవిత ఉమ్మడి జిల్లాలో పర్యటనలు పెరిగాయి. ఎక్కువ రోజులు
జిల్లాకు కేటాయిస్తున్నారు. రాజకీయంగా మళ్లీ చురుగ్గా కార్యక్రమాల్లోనూ
పాల్గొంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాలలో తనదైన శైలిలో
వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా కవిత గురించే చర్చ
సాగుతోంది. మళ్లీ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఏ స్థానం
నుంచి పోటీ చేస్తారన్న చర్చ జోరందుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు.. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో బీఆర్ఎస్ తరపున కవిత అన్నీ తానై
వ్యవహరిస్తుండటంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్‌కే పోటీ
చేస్తారా లేదంటే అసెంబ్లీ బరిలో నిలుస్తారా అన్న విషయం మీదే చర్చంతా
సాగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా జిల్లా పర్యటనల్లో కుల సంఘాలతో అంతర్గత
సమావేశాలు నిర్వహించారు. ఇటీవల నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో
కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో కవిత పార్లమెంట్‌కు పోటీ చేస్తారని, భారీ
మెజార్టీతో గెలిపించాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్‌లు
సభలో మాట్లాడారు. దీనికి తోడు ఇటీవల కొందరితో అంతర్గతంగా మాట్లాడిన
సందర్భంలోనూ ఆమె మనసులోని మాటలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల కోసం పార్లమెంట్‌కు పోటీ
అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి
పెడతారని.. అప్పుడు తండ్రి వెంట వెళ్లాల్సి వస్తుందని కాబట్టి పార్లమెంట్‌కు
పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ
రాజకీయాలకు సమయం ఇవ్వాలంటే ఎంపీగా వెళ్తేనే బాగుంటుందని ఆమె మాటలను బట్టి
అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి పోటీ
చేస్తారని జగిత్యాల జిల్లా నుంచి అని ఒకసారి, నిజామాబాద్ జిల్లా నుంచి అని
మరోసారి కాదు కాదు ఉమ్మడి మెదక్ నుంచి బరిలో ఉంటారన్న చర్చ తీవ్రంగా సాగింది.
అయితే కవిత మాత్రం చివరకు పార్లమెంట్‌కే మొగ్గు చూపుతున్నట్టు భావిస్తున్నారు.