జమ్ముకశ్మీర్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ముష్కరులు జరిపిన కాల్పుల్లో
ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో
పోరాడుతూ ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు
వెళ్లిన సైనికులు.. హలాన్ అటవీ ప్రాంతంలో అమరులుగా మారారు. హలాన్ అటవీ
ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం
అక్కడ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఆయుధాలను కలిగి ఉన్న ముష్కరులు
ఒక్కసారిగా సైనికులపైకి కాల్పులు జరిపారు. తేరుకుని ఎదురుకాల్పులు జరిపేలోపే
ముగ్గురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని తోటి
సైనికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జవాన్లు తుదిశ్వాస
విడిచారు. ప్రస్తుతం కుల్గామ్ జిల్లాలో నక్కిన ఉగ్రవాదుల కోసం తీవ్రంగా
గాలిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.