విజయవాడ సెంట్రల్ : కష్ట జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో శనివారం చర్మకారులకు గొడుగుల పంపిణీ
కార్యక్రమం ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి పాలన చర్మకారులకు స్వర్ణ యుగమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు.
గత ప్రభుత్వంలో వీరి జీవనం దుర్భరంగా ఉండేదని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం
వచ్చాక చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కలిపించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు
వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
డీబీటీ పథకాల ద్వారా 46.76 లక్షల మంది మాదిగ సోదరసోదరీమణులకు నేరుగా రూ.
16,650 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. ఇవిగాక నాన్ డీబీటీ పథకాల
ద్వారా మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల
సంక్షేమమే ధ్యేయంగా.. పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో
లిడ్ క్యాప్ డైరక్టర్(దాత) ఎం.ఝాన్సీ రాణి, నాయకులు కంభగళ్ల రాజు, శాంతకుమారి,
కిషోర్, ఆంబోజి శ్రీనివాస్, డి. కోటేశ్వరరావు, పురుషోత్తం, చర్మకారులు
పాల్గొన్నారు.