ఎయిర్ పోర్ట్ నుంచి 150 కార్లతో భారీ కాన్వాయ్
నూతన ఉత్సాహంలో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యేలు డేవిడ్ రాజు, డీవై దాస్, సినీ నిర్మాత కళ్యాణ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఏఐసీసీ నూతన ఇన్చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ కు వచ్చిన మాణిక్కం ఠాగూర్ కు ఘన స్వాగతం లభించింది. ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 150 కార్లు, ద్విచక్ర వాహన కాన్వాయ్, డప్పులు, వాయిద్యాలు, బాణా సంచాతో మాణిక్కం ఠాగూర్ ను ఊరేగింపుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకు వచ్చారు. గజ మాలతో మాణిక్ ఠాగూర్ ను సత్కరించారు. దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఆడబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. పీసీసీ ప్రధాన విభాగంతో పాటు జిల్లాలు, నగరాల కమిటీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ వంటి అనుబంధ విభాగాలు కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక పోషించాయి. భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని జై కాంగ్రెస్ నినాదాలతో హారెత్తించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది.
మాజీ ఎమ్మెల్యేలు, సినీ నిర్మాతలు, పలు పార్టీల నేతలు : మాణిక్కం ఠాగూర్ రాకతోనే ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. పలువురు ముఖ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ లకు మాణిక్ ఠాగూర్ కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా ప్రముఖ సినీ నిర్మాత, బిల్డర్ కళ్యాణ్ దూళిపాళ్లను మాణిక్ ఠాగూర్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఎన్నికల సమరానికి మరో 90 రోజులు మాత్రమే గడువు ఉండటంతో… నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి సహాయంతో రాబోయే ఎన్నికల ప్రచారంలో కొందరు సినీ ప్రముఖలను కూడా వినియోగించుకునే విధంగా, కళ్యాణ్ దూళిపాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో దీర్ఘకాలం రాజకీయ ప్రయాణం చేసిన ప్రియాంక, ప్రొఫెషనల్ ఫోరం నేతి మహేష్ తో పాటు పలువురు మాణిక్ ఠాగూర్ సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరారు. పలువురు ప్రముఖులు చేరిక ఎన్నికల ముందు కాంగ్రెస్ బలోపేతానికి దోహదం చేస్తుందని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఎంపీలు చీర్ గళ్స్ : ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధికి కాంగ్రెస్ గతంలో ఇచ్చిన విభజన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం, వెనకబడిన ప్రాంతాల అభివ్రుద్ధికి నిధులు, ప్రత్యేక ప్రాజెక్టులు వంటివి మళ్లా కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎంపీలందరూ చీర్ గళ్స్ అంటూ ఎద్దేవా చేశారు. వారంతా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని,వారిని ఓడించి ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు మరో 90 రోజులు మాత్రమే గడువు ఉండటంతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజలు సహకరించాలని ఆయన విజ్నప్తి చేశారు. దానికి కాంగ్రెస్ ప్రధాన విభాగంతో పాటు అనుబంధ విభాగాలు కూడా క్రుషి చేయాలని మాణిక్కం ఠాగూర్ పార్టీ శ్రేణులను కోరారు.
సీడబుల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాహుల్ ప్రధాని అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధి చెందుతుందని తెలిపారు. ప్రధాని హోదాలో తన మొదటి సంతకం ఏపీ స్పెషల్ స్టేటస్ మీదే అన్న రాహుల్ గాంధీ మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక అని తెలిపిన ఆయన షర్మిల కూడా అదే ఆశయంతో కాంగ్రెస్ లోకి వచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మయప్పన్, క్రిష్టోఫర్ తిలక్, కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ శీలం, కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శిరివెళ్ల ప్రసాద్, ఉష నాయుడు, రాష్ట్ర మాజీ మంత్రులు బాపిరాజు, మారెప్ప, పీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, ఏఐసీసీ సభ్యులు, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సభ్యులు, పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.