సభ్యులను ఖర్గేనే ఎంపిక చేస్తారు
పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి జైరాం రమేశ్
సభ్యుల నియామక అధికారం అధ్యక్షుడికి అప్పగింత
స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం
రాయ్‌పుర్ : కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీకి ఎన్నిక
నిర్వహించకుండా సభ్యులను నామినేట్ చేయాలని పార్టీ స్టీరింగ్ కమిటీ
ఏకగ్రీవంగా తీర్మానించింది. సభ్యుల నియామక అధికారాన్ని అధ్యక్షుడికి
అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో ప్రారంభమైన 85వ పార్టీ
ప్లీనరీలో ఇందుకు ఆమోద ముద్ర వేసింది. స్టీరింగ్ కమిటీలో ఉన్న 45 మంది
సభ్యులూ ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు పార్టీ ప్రధాన
కార్యదర్శి, మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి జైరాం రమేశ్ విలేకర్ల సమావేశంలో
వెల్లడించారు. దీనికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా మద్దతు పలుకుతారని పూర్తి
విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు.
స్టీరింగ్ కమిటీ భేటీకి సోనియా, రాహుల్ దూరం : కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో
భాగంగా తొలిరోజు నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో సోనియా, రాహుల్,
ప్రియాంకాగాంధీలు పాల్గొనలేదు. మిగతా సభ్యులు స్వేచ్ఛగా చర్చించి తగిన నిర్ణయం
తీసుకొనేందుకు వీలుగా వారు ఈ సమావేశంలో పాల్గొనలేదని పార్టీ వర్గాలు
పేర్కొన్నాయి. శనివారం జరిగే సమావేశాలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తారు. తర్వాత
రాజకీయ, ఆర్థిక, విదేశీ తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు చివరి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయం,
యువత, విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు.
ఉదయం 10.30 గంటలకు రాహుల్‌గాంధీ ప్లీనరీని ఉద్దేశించి మాట్లాడుతారు. మధ్యాహ్నం
2 గంటలకు పార్టీ అధ్యక్షుడు ముగింపు ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు
బహిరంగ సభ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో పాటు మల్లికార్జున ఖర్గే,
రాహుల్‌గాంధీలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.