విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్
ఉద్యోగుల సమస్యల పై వారికి అండగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ
జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం
విజయవాడలోని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ భవన్ లో అన్ని డిపార్ట్మెంట్ల
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు
విషయాలపై ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించడం జరిగిందని తెలిపారు.
20 ఏళ్లుగా కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వాలు జాప్యం
చేస్తూ కాలయాపన జరిగిందని ఇప్పటికైనా కాంటాక్ట్ ఉద్యోగుల దీన పరిస్థితిని
ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుని ఆలస్యం చేయకుండా వెంటనే క్రమబద్ధీకరించాలని
ప్రభుత్వాన్ని కోరారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్
ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆర్ధికేతర
అంశాలైన మహిళా కాంటాక్ట్ ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లీవులు, ఇతర సౌకర్యాల
కల్పనపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 11వ పిఆర్సి లో ఔట్సోర్సింగ్
ఉద్యోగులకు అధికారుల కమిటీ నిర్ణయించిన మేరకు వేతనాలు పెంచకపోగా కేవలం 23 శాతం
పెంచడం బాధాకరమన్నారు. కావున తక్షణమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అప్కాస్
సంస్థ సేవలను విస్తృత పరిచి జిల్లా స్థాయిలో ఈపీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను అక్కడే
పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే చిరుద్యోగులైన
కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అన్ని
వర్తింపజేయాలని, రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్
ఉద్యోగులకు వయసుతో సంబంధం లేకుండా తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని
కోరుతూ సమావేశం తీర్మానించడమైనది. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ
జెఎసి అమరావతి చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్
ఉద్యోగులు అందరు పాల్గొని సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ
కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కే సుమన్ సెక్రటరీ జనరల్
భానుజీరావు అన్ని జిల్లాల కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులు
పాల్గొన్నారు.