హైదరాబాద్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి
కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం మృతి
చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక
వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె
ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తోటి
స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు శోకసంద్రంలో
మునిగిపోయారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి
గ్రామం. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తుండేది. ప్రీతి తండ్రి
నరేందర్ రైల్వే డిపార్ట్మెంట్లో ఏ ఎస్ ఐ గా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. విధుల్లో
భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె
ప్రీతి.
అసలేం జరిగిందంటే : సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి విషపు
తనకు తానుగా ఇంజక్షన్ తీసుకుంది. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి
వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ
ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించగా అంతకంతకూ
ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు
తరలించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో
దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ
గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి
పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. అయితే.. హానికర ఇంజక్షన్
తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ పై ప్రభావం ఎక్కువగా పడుతుందని
డాక్టర్లు చెప్పారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడుతున్న
పరిస్థితుల్లో న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు
వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్
వైద్యులు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే ఐదురోజులుగా ప్రీతిని కాపాడాలని
ప్రత్యేక బృందం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆడియో కలకలం : ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు రోజు ప్రీతి తన తల్లితో
మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఫోన్ కాల్లో ప్రీతి తన బాధను తన తల్లితో
చెప్పుకుంది. ‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడు.
సీనియర్లు అంతా ఒకటేనని తెలిపింది. ప్రీతి తండ్రి పోలీసులతో ఫోన్ చేయించినా
లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో
బాధపడుతూ ప్రీతి కుమిలిపోయింది. ఒక వేళ నేను సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే
సీనియర్లందరూ ఒకటైపోయి నన్ను దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌తో
మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి ప్రీతి తల్లీ నచ్చజెప్పింది.
అయినా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డి ఏదైనా ఉంటే నా దగ్గరికి రావాలి కానీ
ప్రిన్సిపాల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశారని నాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు
ప్రీతి తల్లితో చెప్పారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అన్ని దారులు
మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తల్లి వెల్లడించింది.
నిందితుడు అరెస్ట్ : డాక్టర్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను మట్టెవాడ
పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సైఫ్ కు కోర్టు 14 రోజుల
రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని ఖమ్మం జైలుకు
తరలించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ కేసులో ఎంజీఎం విధుల నుంచి సైఫ్‌ను సస్పెన్షన్ చేశారు. మెడికల్
లీగల్ కేసుగా పరిగణిస్తూ చర్యలు తీసుకున్నట్లు ఎం జీ ఏం సూపరింటెండెంట్
వెల్లడించారు. వేధింపులు రుజువై శిక్షపడితే సైఫ్‌ను కాలేజీ నుంచి సస్పెండ్
చేస్తామని హెచ్చరించారు. అలాగే డీఎంఈకి వైద్యుల బృందం విచారణ నివేదికను
పంపించామని పేర్కొంది. విచారణ నివేదికను ఎంసీఐకి సైతం పంపిస్తామని
సూపరింటెండెంట్ తెలిపారు.