మంగళగిరి : జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీ జెండా, అజెండాల కోసం పనిచేయదని
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరి
ఆత్మగౌరవానికి భంగం వాటిల్లనివ్వనని అన్నారు. వాస్తవిక ధోరణితో ఆలోచించి
నిర్ణయాలు తీసుకుంటాను తప్ప అవమాన పడి, గింజుకొని ఎవరితోనో ఎందుకుంటానని
అన్నారు. నచ్చకపోతే నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్పేస్తాను తప్ప లోపాయికారి
ఒప్పందాలు పెట్టుకోనని చెప్పారు. ఈ మధ్య వెయ్యి కోట్లు… వెయ్యి కోట్లు అని
మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని, డబ్బుతో ఎవరూ రాజకీయ పార్టీని నడపలేరన్నారు.
జనసేన పార్టీ భావనాబలంతో నడుస్తుంది తప్ప డబ్బుతో కాదన్నారు. కాపులు పెద్దన్న
పాత్ర పోషించి దళితులు, బీసీలను కలుకొని వెళ్లగలిగితే రాజ్యాధికారం
సిద్ధిస్తుందని, లేనిపక్షంలో ఎన్నటికీ రాజకీయ సాధికారిత సాధ్యం కాదని అన్నారు.
ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సంఖ్యా బలం ఎక్కువ ఉండి కూడా
రాజ్యాధికారం చేజిక్కుంచుకోలేని కులాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమూహాలు
చాలా కీలకమైనవి. ఇప్పటికి కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వండి, ఫీజు రీయింబర్స్
మెంట్ ఇవ్వండి అని చేయి చాచడం బాధాకరం. కొంతమంది నాయకులు కులాలను వాడుకొని
పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప కులానికి ఉపయోగం పడటం లేదు. ఇంత సంఖ్యాబలం
ఉండి కూడా దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి కాపులు ఆత్మపరిశీలన
చేసుకోవాలి. సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారంలోకి రాగానే బీసీలు, దళితులను
ఎదగనివ్వరనే విష ప్రచారం బయట జరుగుతోంది. దానిని బలంగా తిప్పికొట్టాలి.
కాపులకు సాధికారిత రావాలంటే ఒక తరం నాయకులు త్యాగానికి సిద్ధం కావాలి.
వ్యక్తిగత పదవులను త్యాగం చేసి రాజకీయ సాధికారిత కోసం ప్రయత్నం చేస్తే మళ్లీ
ఎప్పుడూ కూడా దేహీ అనే పరిస్థితి రాదు. మరీ ముఖ్యంగా కాపుల్లో ఐక్యత రానంత
వరకూ రాజకీయ సాధికారిత సాధ్యం కాదు. కాపుల ఆర్థిక వెనుకబాటుతనాన్ని సంపూర్ణంగా
అర్థం చేసుకున్నవాడిని… వాళ్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి అంశాన్ని
ఆకళింపు చేసుకున్నవాడిగా చెబుతున్నాను.
రామ్ మనోహర్ లోహియా కలను జనసేన సాకారం చేస్తుంది
రామ్ మనోహర్ లోహియా ‘క్యాస్ట్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
కుల రాజకీయాల గురించి ప్రస్తావించారు. బీసీలు, దళితులు, కాపులు కలిస్తే
రాజ్యాధికారం ఇంక ఎవరికీ దక్కదని రాశారు. ఆ పుస్తకం1964లో రాశారు. ఇప్పటికి
దాదాపు 50 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఆ కాంబినేషన్ నేటికీ కుదరలేదు. రామ్
మనోహర్ లోహియా కలను జనసేన సాకారం చేస్తుంది. కాపులు, బీసీలు, దళితులను కలిపి
రాజ్యాధికారం సాధిస్తుంది. కాపులు, బీసీలు, దళితులు ఎదగడం అంటే మిగతా కులాలను
తగ్గించడం కాదన్నారు.