ఏపీ లో కాపు కార్పొరేషన్ నిర్వీర్యం
ఏపీ బి ఆర్ ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్ర శేఖర్
గుంటూరు : తెలగ, బలిజ, కాపు, ఒంటరి తదితర అనుబంధ కులాల సంక్షేమానికి భారత
రాష్ట్ర సమితి పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు
కమ్మునిటీ భవన్ కోసం తెలంగాణ సిఎం కేసి ఆర్ 6.87ఎకరాల భూమిని జీఓ 87 ద్వారా
కేటాయించారు. అందుకు చొరవ చూపిన తోట చంద్రశేఖర్ ను యాళ్ళ వరప్రసాద్ ఆధ్వర్యంలో
వివిధ కాపు సంఘాల నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తోట
మాట్లాడుతూ దక్షిణ భారతంలో తెలగ, బలిజ, కాపు, ఒంటరి తదితర పేర్లతో ఉన్న
మూడుకోట్ల మంది కాపు అనుబంధ కులాల వారికి దశాబ్ధాలుగా తీవ్ర అన్యాయానికి
గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు జాతి సామాజిక, ఆర్ధిక, ఉపాధి,
రాజకీయ రంగాల్లో వెనకబాటుకు లోనౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నీ
రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతూ వారి
అభ్యున్నతిని మరిచాయని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాపు కార్పొరేషన్
ద్వారా ఏడాదికి రెండు వేల కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సిఎం జగన్
మొండి చేయి చూపి కాపు జాతిని మోసగించారని మండిపడ్డారు. ఎపిలో 1.25 కోట్లమంది
జనాభా ఉన్న కాపులు ఏళ్ల తరబడి కాపు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్న
వైసీపీ సర్కార్ కాపుల మనోభావాలను గౌరవించక వాటిని బుట్టదాఖలు చేసిందని ఘాటుగా
వ్యాఖ్యానించారు. ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఇచ్చే ఐదు శాతం ఈబీసీ
రిజర్వేషన్లు కాపులకు అమలు చేయకుండా వైసీపీ సర్కార్ నిర్ధాక్షిణ్యంగా వాటిని
తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అన్నీ రంగాల్లో ముందుకు
తీసుకెళ్తున్న సిఎం కెసిఆర్ కాపులకు పెద్దపీట వేస్తూ హైదారాబాద్ నగరం
నడిబొడ్డున హై టెక్ సిటీ సమీపంలో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్మునిటీ భవనం
కోసం 6.87 ఎకరాల కేటాయించి కాపుల పట్ల ఆయనకున్న చిత్తశుద్దిని
చాటుకున్నారన్నారు.ఎపి లో ఇందుకు భిన్నంగా సిఎం జగన్మోహన్ రెడ్డి కాపుల
సంక్షేమాన్ని విస్మరించి వారిని అణగద్రోక్కే ప్రయత్నం చేస్తున్నారని
ద్వజమెత్తారు. ఏపీ లో బి ఆర్ ఎస్ పార్టీకి అన్నీవర్గాల ప్రజల నుండి అపురూప
ఆదరణ లభిస్తోందని స్పష్టం చేశారు ల్. ఏపీ కూడా కాపు సంక్షేమ భవనం కోసం సిఎం
జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్
చేశారు. ఈ కార్యక్రమంలో తోట మధు , ప్రముఖ డాక్టర్ నాగార్జున, శ్రీనివాసుల
కృష్ణ, తోట ప్రవీణ నాయుడు, మర్రి శెట్టి మురళి, వివిధ కాపు సంఘాల నాయకులు
పాల్గొన్నారు.