గుంటూరు : రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు
చదివేలా, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ది చెందేలా అన్ని చర్యలూ
తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున
చెప్పారు. మధురవాడ గురుకులానికి చెందిన విద్యార్థులు తమ వినూత్న ఆవిష్కరణతో
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారని ఉదహరించారు. కార్పొరేట్
సంస్థలకు ధీటుగా తమ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీస్ పీట్లు కూడా
సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి విశాఖజిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన
మంత్రి మేరుగు నాగార్జునను శనివారం సర్క్యూట్ హౌస్ లో మధురవాడలోని డా.బీఆర్
అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఇ) గురుకులం విద్యార్థులు, టీచర్లు కలిసి
తమ విద్యార్థులు సాధించిన ఘనతను గురించి వివరించారు. డాక్టర్ రోబోట్ అనే
ఆవిష్కరణ ద్వారా సిఓఇ కి చెందిన 6 మంది విద్యార్థులకు తెలుగు బుక్ ఆఫ్
రికార్డ్స్ లో స్థానం లభించిందని తెలిపారు. నాగార్జున విద్యార్థులు తయారు
చేసిన డాక్టర్ రోబోట్ ను పరిశీలించారు. దానిని తయారు చేసిన విద్యార్థులను
అభినందించడంతో పాటుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కు సంబంధించిన ధృవపత్రాలను
అందించారు. అనంతరం మంత్రి దేవరాపల్లి లోని ఎస్సీ గురుకులంను సందర్శించి అక్కడి
విద్యార్థులతో ముచ్చటించారు. గురుకులంలోని అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం
విద్యార్థులకు టెన్త్ హాల్ టిక్కట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగానే నాగార్జున
మాట్లాడుతూ, పదవ తరగతిలో రాష్ట్ర సగటు ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలను తమ
గురుకులం విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. ఏ కారణంతోనైనా పదవ తరగతిలో
ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్లు పెట్టించి మళ్లీ పరీక్షలకు
పంపిస్తున్న విధానం కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. గురుకులం విద్యార్థులకు
పదవ తరగతి తర్వాత ఉన్నత విద్యావకాశాలు మెరుగ్గా ఉండాలన్న లక్ష్యంతో ఐఐటీ, నీట్
కోచింగ్ సెంటర్లను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఉన్న ఈ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న
విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలను
సాధిస్తున్నారని తెలిపారు. ఐఐటీలు. ఎన్ఐటీలతో పాటుగా ఎంబీబీఎస్, డెంటల్
సీట్లను అత్యధికంగా సాధిస్తున్నారని వివరించారు. ఐఐటీలు. ఎన్ఐటీలతో పాటుగా
ఎంబీబీఎస్, డెంటల్ సీట్లను సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా నగదు
ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతోందన్నారు. గురుకులాల్లో
చదువుకుంటున్న పిల్లలకు మంచి చదువుతో పాటుగా పౌష్టికాహారాన్ని కూడా
ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ గురుకులాల
అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల ఫలితంగా గురుకులాల్లో మౌలిక వసతులు కూడా
పూర్తిగా మెరుగుపడ్డాయని అభిప్రాయపడ్డారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్
టిక్కట్లను అందిస్తూ వారు 100% ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. దేవరాపల్లి
గురుకులం ఆవరణలో తన పర్యటన సందర్భంగా నాగార్జున ఒక మొక్కను నాటారు.