హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం శతజయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను, స్ఫూర్తి నీ, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారన్నారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీరా ను ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కాలంగా పోరాడారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా నీరా పాలసీ నీ ప్రవేశపెట్టారని వెల్లడించారు. రాష్ట్రంలో నీరా పాలసీ ప్రవేశ పెట్టడం లో కామ్రేడ్ ధర్మబిక్షం గారి స్ఫూర్తి ఉందన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా కామ్రేడ్ ధర్మబిక్షం సేవలను కొనియాడారు.