ఎక్కడి నుంచో వస్తున్న డబ్బులతో మీటింగ్ లు పెట్టడం లేదని వ్యాఖ్య
ప్రజలకు మంచి చేయాలనే ఏకైక లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్న మంత్రి
ధర్మాన
శ్రీకాకుళం : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు
చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీకి కూడా ఇబ్బందులు
కలగజేసేలా ఉంటున్నాయి. తాజాగా ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గత
నాలుగేళ్లలో వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా బాగా చితికిపోయారని ఆయన అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు స్థానిక నేతలు,
కార్యకర్తలు ఎంతో ఖర్చు చేస్తున్నారని, వారికి పైసా లబ్ధి కూడా చేకూరలేదని
చెప్పారు. ఎక్కడి నుంచో వస్తున్న డబ్బులతో స్థానికంగా మీటింగ్ లు పెట్టడం
లేదని… కార్యకర్తల చేతి చమురు వదులుతోందని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే
ఏకైక లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ధర్మాన చెప్పారు. అవినీతికి తావు
లేకుండా అన్ని పథకాలు లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతున్నాయని అన్నారు.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవని విమర్శించారు.
శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.