విజయవాడ : సకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తి అయ్యేలా చర్యలు
తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పారదర్శకతకు
పెద్దపీట వేయాలన్నారు. మంగళవారం రాజ్ భవన్ వేదికగా జరిగిన ప్రత్యేక
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2021-2022 వార్షిక
నివేదికను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్
మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల కోసం యువత వేచి ఉన్నారని , వారి
ఆకాంక్షలకు అనుగుణంగా కమీషన్ వేగవంతంగా వ్యవహరించాలని స్పష్టం చేసారు. కమీషన్
ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ సంస్ధ కార్యకలాపాల గురించి గవర్నర్ కు వివరిస్తూ
న్యాయపరమైన వివాదాల ఫలితంగా సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధికమించేందుకు
ప్రయత్నిస్తున్నామన్నారు. అతి త్వరలో మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు
కమీషన్ కసరత్తు చేస్తుందన్నారు. 2018 లో 165 గ్రూప్ 1 పోస్ట్‌ల భర్తీ కోసం
విడుదల చేసిన నియామకాలను 2022 జూలైలో పూర్తి చేసామన్నారు. వీరిలో 30 మంది
డిప్యూటీ కలెక్టర్లు, 28 మంది డిఎస్పిలు ఉన్నారన్నారు. 2022 సెప్టెంబర్ 30న 92
గ్రూప్ 1పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసామని, ప్రిలిమినరీ స్క్రీనింగ్
టెస్ట్ 2023 జనవరి 8న షెడ్యూల్ చేసామని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. పలు
వివాదాల కారణంగా 2021కి ముందు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల నియామక
ప్రక్రియలు పూర్తి అయ్యాయని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2021-2022 సంవత్సరంలో
24 నోటిఫికేషన్లు రాగా, నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 190
అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు పూర్తి చేయగా, మిగిలిన వాటిని కూడా గడువులోగా
పూర్తి చేస్తామని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో గవర్నర్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు
కె. విజయకుమార్, అచార్య పద్మరాజు, డాక్టర్ జివి సుధాకర్ రెడ్డి, ఎవి రమణా
రెడ్డి, పి. సధీర్ , ఎన్ సోనీ ఉడ్, ఎన్. సుధాకర్ రెడ్డి , రాజ్ భవన్ సంయిక్త
కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.